Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః

గోపీనాథ రామాయణము

అయోధ్యాకాండము



రాధాకుచకుంకుమ
సారాంకితతారహారసంకలితవిశా
లోరస్థలయాశ్రితమం
దారా నవనీతచోర నందకుమారా.

1


వ.

దేవా అవధరింపుము కుశీలవు లగుకుశలవు లవ్వలికథ యిట్లని చదువం
దొడంగి రిట్లు పితృభ్రాత్రనుజ్ఞానంతరంబునఁ గామాదివికారరహితుం డగు
శత్రుఘ్నుండు తనయన్న యగులక్ష్మణుండు బలవంతుం డగురామున కాశ్రితుం
డయ్యె నాచేతను మహదాశ్రయంబు కర్తవ్యం బని తలంచి కలుషబుద్ధి
రహితుం డై మాతులగృహంబునకుం జను భరతునిచేత మాతులగృహవాస
జనితసౌఖ్యం బే నొక్కరుండ ననుభవించుట సముచితంబు గాదనుబుద్ధిచేత
నీతుం డై భరతవిషయస్నేహపురస్కృతుండై యతనివెంటం జనియె.

2

భరతుండు శత్రుఘ్నసమేతుఁ డై తనమాతులగృహంబునకుం జనుట

ఉ.

ఆతతతేజుఁ డాభరతుఁ డచ్చట భ్రాతృసమన్వితంబుగాఁ
జాతురి మీఱ నిత్యమును సత్కృతి సత్కృతుఁ డై కృపాలుఁ డా
మాతులుఁ డద్భుతక్రియఁ గుమారకవత్సలతం గడంగి వి
ఖ్యాతిగ గారవింపఁ జెలువాడుచు నుండె ముదం బెలర్పఁగన్.

3


తే.

అభిమతపదార్థములచేత నచటఁ దర్ప్య
మాణు లయుఁ నయ్యిరువురు మానసమున
వృద్ధనృపుఁ డైనతండ్రిని వీరుఁ డైన
రామునిఁ దలంచుచుండిరి రమణతోడ.

4


క.

జననాథుండును జిత్తం, బున నిత్యముఁ దలఁచుచుండెఁ బ్రోషితసుతులన్
ఘనుల భరతశత్రుఘ్నుల, ననిమిషపతి వరుణనిభుల నర్కప్రభులన్.

5