పుట:Goopa danpatulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1914 సంవత్సరమున గోపాలపట్టణపు రైల్వేస్టేషనునకు ఆర్మొగముపిళ్ళగారను తమిలదేశస్థు డొకడు మాష్టరుగా నుండెను. అతడు మిగుల బూర్వాచారపరాయణుడు, ప్రజావంతుడు. అతనిభార్య సుందరమ్మాళు భర్త కనుగుణవర్తినియైయుండును. వారి మతము శైవమతము. వారుతఱుచుగా దమదేశాచారముల ననుసరించి యేవియో యుత్సవములు చేసికొనుచుందురు. ఆ యుత్సవ దినములలో నింట బిండివంటలు మెండుగా జేసికొని బంధుమిత్రాళితో భుజించుచు దమకు బరిచితులగు తద్గ్రామస్థులం గొందఱిని గూడ విందునకు రమ్మని పిలిచి యాదరించుచుందురు. సుందరమ్మ వివరణము చవిజూడని స్త్రీ లాజనపదమందు లేరు.

ఆగ్రామమున గొల్లలసంఖ్యయెక్కువ. వారిలో ఆవుల యప్పలస్వామి యనబడువాడుమేటి. వానిభార్య గంగమ్మ వానికన్నివిధముల ననుకూలవతియై వర్తించుచుండును. ఆజాయాపతులు పాలవర్తకము చేయుచుందురు. అక్కడనున్న యుద్యోగులకెల్ల బాలును బెరుగును గంగమ్మయే యమ్ముచుండును. కొందఱు గొల్లలు అప్పలస్వామి యింటికివచ్చి పాలు పెరుగులు విరివిగా గొని విశాఘపురికి గొనిపోయి మరల నమ్ముకొందురు. ఈవర్తకములో నప్పలస్వామికాని యతనిభార్యగాని ప్రజల నేమియు మోసముచేసి యెఱుగరు. పాలలో నొక్క నీళ్ళచుక్క యైన గలుపరు; పెరుగులో గూడ నెట్టి 'కల్తీ' యు లేకుండును. ఇట్టులుండుటచే వారికి విశేషధనము