పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

గోన గన్నా రెడ్డి

కాలం పెంటికోసం కూసినరీతిగా కూసినారండీ. దానికి ప్రతిగా పెంటి హారీతి కూయిడినట్లు తోట నాలుగు మూలలనుంచీ వినబడ్డాయండీ. నా కా పురుషుడు కూసినట్లు తెలియకపోతే నేను ‘ఏదో పక్షి కూస్తోంది’ అనుకొనే దాన్నండీ. తర్వాత మేం బయలుదేరాము. ఆ వనానికి చుట్టూ ఉన్న పెద్దగోడ దగ్గరకు ఉత్తరంగా నడుపుకుంటూ తీసుకుపోయాడండీ. ఆ డొంకల్లో పిల్లి అడుగులతో నెమ్మదిగా ఏలా తీసుకొనివెళ్ళాడో సోమారెడ్డి ప్రభువండీ. అక్కడకు పోగానే ఆయనలాగే రాజవేషాలు ధరించివున్న నలుగురు రెడ్డి ప్రభుకుమారులు చారులలా వచ్చి కలుసుకొన్నారు. ఎలా దాటించారో నన్ను చెండులా! నన్ను అవతలికి దింపారు. అంతకుముందే నన్ను ఒక మూలగా పోయి పురుషవేషం వేసుకొమ్మని ఆదవోని సేనాపతుల లాంటి వేషానికి సరిపోయే వస్త్ర కవచాదులు నాకు యిచ్చారండీ. నేను చాటుగా పోయి పురుషవేషం వేసుకువస్తే వారు నాకు కవచాలు తొడిగారండీ. మేమందరం ఆదవోని సైన్యపు ఉప సేనాపతులలా ఉన్నాము. ఆ తరువాతనే కోటగోడ దాటాము. ఆ ప్రక్కన ఉన్న ఒక యింటి దొడ్డిలో ఆరు గుఱ్ఱాలున్నాయండీ. మేము గుఱ్ఱాలెక్కి నిర్భయంగా ఉత్తరపు కోట గోపుర ద్వారాన్ని చేరుకొన్నాము. కోటగుమ్మం దాటే సాంకేతికపు మాటలు వాళ్ళకు తెలుసును కాబోలు! ఆ గుమ్మము దాటి అంచెలు అంచెలుగా ఈ ఊరు ఇంతకు ముందు నాలుగు ఘడియల క్రితం చేరుకున్నామండీ. నన్ను వారు తిన్నగా కుప్పాంబాదేవి మహారాణిగారి నగరంలోకి తీసుకువచ్చి విషయం చెప్పి ఒక దాసీకి అప్పగించారు. ఆ దాసీ తన గదిలోకి తీసుకువెళ్ళింది. నేను అక్కడ నా ఆడ వేషం మళ్ళీ వేసికొని ఆ దాసీ తమ నగరికి దారి చూపిస్తే ఇక్కడకు వచ్చానండీ. ఇంతట్లో తమరు ఇక్కడకు వచ్చారు.

అన్నాంబిక: నీ చరిత్ర బృహత్కథాగ్రంథంలో కథలా ఉందే! నీవు రావడం ఒక పండుగలాగే ఉంది. ఇచట ఏంత ప్రేమతో చూచినా, కావలసినవాళ్ళు దగ్గర ఉండటం విషయం వేరు.

వాళ్ళిద్దరూ మాటా మంతీ చెప్పుకుంటూ కాలం గడిపారు.

ఆ రాత్రి అన్నాంబికకు ఎన్ని ఘడియలకూ నిద్రపట్టదు. ఎంత అందగాడా గన్నారెడ్డి ప్రభువు! ఎంత ఉత్తమ వీరుడు! లలితములై కనబడుతూ దృఢములైన ఆ వీరుని చేతులు తన్ను ఆ మహాపురుషుని హృదయానికి దగ్గరగా అదుముకోగలవా! లోతులై వెడదలైన ఆ సుందరాంగుని కన్నులు తన్ను చూచిన వెంటనే ఆనంద కాంతులతో సూర్యో దయాలవలె వెలిగి పోగలవా? పూలతో సింహాసనము అమర్చి ఆయనను అందు అధివసింప జేసి తా నా మనోహరమూర్తి పాదాలకడ యుగ యుగాలు అధివసించి ఆ