పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

83

కుప్పాం: నేనూ, బుద్ధపుర మహాప్రభువులూ బయలుదేరి శ్రీ గణపతి రుద్రదేవ సార్వభౌములను, శ్రీరుద్రదేవ ప్రభువులను దర్శించడానికి వెళ్ళాలను కుంటున్నాము. రేపు పూర్ణిమ వెళ్ళిన తదియనాడు అందరమూ బయలుదేరి వెళ్ళుదాము.

అన్నాం: నావల్ల మీ కందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయికాదా!

కుప్పాం: అదేమమ్మా ఆ మాటలు? ఒకసారి మా తమ్ముడు మీ క్షమాపణ అడగాలని.....

అన్నాం: నా క్షమాపణా? ఎంతమాట! వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పించవలసి ఉన్నది. వారి దర్శనము చేయిస్తారా?

కుప్పాం: రోగీ, వైద్యుడూ పాలే కోరుతారు ఒక్కొక్కప్పుడు.

చిరునవ్వు ఆమె మోమున ప్రసరింప అన్నాంబికచేతిని గ్రహించి కుప్పాంబిక తన అంతఃపురంలోనికి తీసుకువెళ్ళి అభ్యంతర సభాగృహంలో ఒక సింహ పీఠికపై కూర్చుండబెట్టింది.

చెలులు పలువురు వచ్చి, అన్నాంబికకు, కుప్పాంబాదేవికి లత్తుకపెట్టి కుంకుమపూవు పాపటను అద్ది, గంధం, పరిమళతైలాలు అలదినారు. ఒక చెలి బంగారు పళ్ళెరమున అమూల్యాభరణాలు తీసుకొనివచ్చి ఆమెకు అలంకరించింది. ఆమెను అలంకారమందిరానకు కొనిపోయి, వెలపొడుగుచీర, ఉపవీతము, స్తన చీనాంబరము కట్టినారు.

మరల అన్నాంబికాకుమారిని కొనివచ్చి వా రామెను ఉచితపీఠంపై అధివసింపచేసినారు. ఇంతలో వా రిద్దరి అనుమతిని వేడుతూ గోన గన్నయ్య వార్త పంపినారు. అన్నాంబికా రాకుమారి అనుమతి ఇచ్చినది.

గన్నారెడ్డిని చూచుట యనగనే ఆమెకు మహానందమైనది. ఆయనకై త న్నలంకరిస్తున్నారని ఆమె పారవశ్యం పొందింది. ‘ఆయన వరుడై, తాను వధువైననాడూ ఇలాగే అలంకరిస్తారా?’ అని ఆమె ప్రశ్నించుకొన్నది.

ఒకసారి మెరుపుమెరసినట్లు ఆ పురుషుని చూచింది! రెండవసారి తోటలో చంద్రకాంతిలో అస్పష్టంగా తొందరపాటులో చూచింది ఆ సందర్శనాలే చాలు, ఆయన దివ్యవిగ్రహము తనహృదయంలో అనంతకాలం నిలిచిఉండుటకు. ఎంతటి ఉన్నతరూపము! ఏమి దేహచ్ఛాయ! ఏమా బలరూపసంపద! ఏమి ఆఠీవి! కుమారస్వామి కా ఠీవి ఉండగలదా? ఆ నడకలో ఎంతటి విలాసము! ఆయన కంఠమాధుర్యము తన శ్రవణలోకంలో దివ్యగీతాలు రచించినది! సంతతహాస ప్రపుల్ల మా మోము. ఆ సోగమీసాలు, ఆ విశాల నేత్రాలు, ఆ కాటుకకళ్ళు, తెల్ల దానిమ్మగింజలవంటి పలువరుస! ఓహో! ఆ బాహువులబలం శ్రీరామచంద్రుని వింటిని విరువగలదు. ఆ బాహువుల బలం పువ్వులనైన నల్పలేదు. ఆ బాహువులు స్వామిద్రోహుల పిండిగొట్టగలవు.