పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

గోన గన్నా రెడ్డి

ణాలూ, కుండలాలూ విరజిమ్మేకాంతితో కలసిపోయే దేహంకలవారూ, పట్టుకాసెకోకలవ్రేలు బంగారు ఒరలలో బంగారు పిడుల బాకులుగలవారూ, వెడద ఉరాలవారూ, వారివారి పీఠాలమీద పోతపోసిన విగ్రహలులాగ అధివసించి యున్నారు.

వివాహవేదిక మూడుప్రక్కలా వేదవేదాంగపారంగతులునూ, పండితోత్తములునూ అయిన బ్రాహ్మణోత్తములు ఋషులవలె కూర్చుండి గంభీరస్వరాలతో వేదగానం చేస్తున్నారు. గాయకులు వారివారి విద్వత్తులు చూపిస్తున్నారు. నటీబృందం సవిలాసంగా నృత్యము చేస్తున్నది.

వసిష్ఠులవారు పెండ్లి కుమారునిచేత ఆచమనాదులను చేయిస్తున్నారు. చుట్టూ కాండపటాలమధ్య దాసీజనము బంగారు చప్పరములో వధువును తోడ్కొని వస్తూఉన్నారు.

భేరీభాంకారాలు, నాదస్వరాలు, పిల్లనగ్రోవులు, ఇత్తడికొమ్ములు, కనక తప్పెటలు, మురజలు మొదలైన వాద్యాల మంగళధ్వనులు దిశలు నిండుతున్నవి.

ఆ సమయంలో నిశితకృపాణహస్తాలతో పదిమందివీరులు తన్ను పరివేష్టించి రాగా, ఎడమచేయి నూనూగుమీసమును, కుడిచేయి పట్టుదట్టీని సవరింప సన్నగా శలాకవలె పొడుగైనవాడు, శిరస్త్రాణంపై బంగారు కిరీటలాంఛనం గలవాడు, మిలమిలలాడు కుబుసమువంటి ఉక్కు కవచముపై హారాలు ధరించినవాడు, ఎడమ పార్శ్వమున బంగారుచెక్కడములపై మణులు వెలుగుతూఉండే పిడిగల దీర్ఘ కరవాలంగలవాడు, చిరునవ్వు మోమున నర్తించేవాడు, లోకభీకరుడూ, రాజుల గుండెల్లో నిద్రపోవువాడు, బీదలపాలిటి కల్పతరువు, గజదొంగ గోన గన్నా రెడ్డి సాహిణి ఒయ్యారి నడకలతో మందమందముగ వివాహమంటపమున బ్రవేశించెను.

పెళ్ళికుమారుడైన గోన వరదారెడ్డి సాహిణిని గుబుక్కున లేవదీయడం, విఠలనాథుడూ సూరనరెడ్డీ అనే పిట్టపిడుగుల కౌగిలింతలకు ఆ రాజకుమారుణ్ణి అప్పజెప్పటం, వారందరితోపాటు సింహద్వారాలు దాటడం, వారితో గుఱ్ఱాలపై చెంగునఉరికి గన్నా రెడ్డి అధివసించడం కన్నుతెరచి మూసేలోపలే జరిగి పోయింది.

అక్కడఉండే సభికులు యావన్మందీ, రాజులు, మంత్రులు వీరవాహినీ పతులు మ్రాన్పడిపోయారు. వివాహమంటప మంతా ఒక్కసారి పెద్దసముద్ర కెరటం విరిగిపోయినట్లు మహారావంతో నిండిపోయింది. కూరుచున్న ఆసనాల మీదినుంచి ఆ వీరులు ఉరికారు. అంగరక్షకులను పిలిచి సేన లాయత్తం చేయుడన్నారు. అశ్వాలను కొనిరండన్నారు. రథాలు పూన్చుడన్నారు. ఉక్కిరిబిక్కిరిగా రణగుణధ్వనుల్లో మునిగిపోయారు వీరవరేణ్యులు యావన్మందిన్నీ.

ఎక్కడ పురరక్షకులు నక్కడే ఆపుచేసి పురసైన్యాల కేమిన్నీ తెలియకుండానే కోట తూర్పుద్వారంనుంచిఉన్న రాజపథమంతా తనవీరులతో ఆక్రమించి,