పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

77

ఆపుచేయలేకపోయారు. చెలుకినాయుడి సైన్యాలన్నీ చిందరవందర అయిపోయాయి. అప్పుడు యుద్ధవిశారదుడైన చెలుకినాయుడు తన మహానిస్సాణ గజాన్ని తుంగభద్రానదీ నీరాలలోనికి దింపినాడు. ఆ నిస్వాణధ్వని విని చెలుకినాయని సైన్యాలన్నీ తుంగభద్రలోనికి దిగినవి. తుంగభద్రను దాటిన చెలుకినాయని సైన్యాలు ఇదివరకు అక్కడ కాపలా కాస్తూయున్న సైన్యాలతో కలసి ఉత్తరాభిముఖము పట్టి అతి వేగముగా పారిపోవడం ప్రారంభించాయి. ఐంద్రి ఆవల సైన్యాలు విఠలునికి దాసోహ మన్నాయి.

తెల్ల తెల్లవారిపోతున్నది, ముందు బేడ చెలుకినాయని నిస్సాణగజము, ఆ వెనుక చెలుకినాయుడు రథందిగి అధివసించిన గజము, ఈ రెంటిని వెన్నంటి తక్కిన సైన్యాలు! కందనోలు యుద్ధంలో తన సైన్యానికి అట్టే నష్టం కలగ లేదని చెలుకినాయుడు సరిచూచుకున్నాడు.

బాగా తెల్లవారేటప్పటికి కృష్ణవద్దకు వచ్చాయి సైన్యాలు, ఆ వసంత కాలంలో ఈషత్ కృశాంగిఅయిన కృష్ణానది వేగముగా ప్రవహిస్తున్నది. చెలుకినాయుడు కృష్ణఒడ్డుననే సైన్యాలను పడమటగా త్రిప్పి కొంత దూరం పోనిచ్చి దక్షిణానికి మరలి ఆదవోని సైన్యాలను కలుసుకుందామనిన్నీ ఆ సైన్యాలతో వెళ్ళి కందనోలు ముట్టడించి నేలమట్టం చేయాలనిన్నీ సంకల్పించాడు.

కాని కృష్ణ ఒడ్డుననే పడమటగా వెళ్ళుతున్న బేడ చెలుకినాయని సైన్యాల వెనుక ప్రక్కనుంచి విఠలధరణీశుని సైన్యాలూ, ముందుప్రక్కనుంచి గోన గన్నారెడ్డి సైన్యాలూ చుట్టుముట్టాయి. గన్నారెడ్డి చెలుకినాయనిచారుణ్ణి ఒకణ్ణి పట్టుకొని వానిచేత చెలుకినాయుడు తన నిస్సాణం గోన గన్నారెడ్డికి సమర్పించి తిన్నగా ఆదవోని పట్టణం చేరుకునే నియమంమీద ఆదవోని సైన్యాలకు ఏమీ ఆపదరాకుండా వదలిపెడతానని వార్త పంపించినాడు. చెలుకినాయుడు అఖండకోపంతో మండిపోయారు. తమప్రాణాలతో గన్నా రెడ్డిని, విఠలయ్యను బందీలుగా పట్టుకొని ఆదవోనికి తీసుకు వెళ్ళక వదలనని చెలుకినాయుడు ఎదురు వార్త పంపించాడు.

ఆ వార్త గోన గన్నారెడ్డి విని పకపక నవ్వుకున్నాడు. తనవార్త గన్నారెడ్డికి వెళ్ళి అందేలోపుగా బేడ చెలుకినాయని మహాసేనానాయకుడు కృష్ణానది పునాదిగా అర్ధచక్రవ్యూహము రచించుకొని గన్నారెడ్డి విఠ్ఠలధరణీశుల విజృంభణ కెదురుచూస్తూ సిద్ధమై ఉండెను.

గన్నారెడ్డి సైన్యాలు విఠ్ఠలధరణీశుని సైన్యాలు ప్రావుక్రోశం దూరం వెనుకకు నడిచాయి. మండిపోయే ఆ వసంత మధ్యాహ్నపు టెండలో చెలుకినాయని సైన్యాలమీద ఎడతెరిపి లేకుండా అగ్నిబాణం కురియడం ప్రారంభించింది. అందులో చెలుకినాయుడు తన రథం దిగి అధివసించిన