పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

గోన గన్నా రెడ్డి

పైన సైన్యాలు, కోటచుట్టూ సైన్యాలను ముట్టడించిన సైన్యాలు అన్నీ యుద్ధం గొడవే మరచి నిద్రపోతున్నాయా అన్నట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. రాత్రి రెండవ యామం పూర్తిఅయి మూడవయామపు కోళ్ళు ఆ చుట్టుప్రక్కలఉన్న శివారు గ్రామల్లో ‘కొక్కరొ కో’ అని అరచేటప్పటికి ‘జై స్వయంభూదేవేశ్వరా జై’ అని రోదసీకుహరం మారుమ్రోగేటంత భయంకరధ్వనితో కోటలోనుండి వచ్చిన విఠలధరణీశుని సైన్యాలనుండీ, చెలుకినాయని సైన్యాలను అరికట్టిన గోన గన్నారెడ్డి సైన్యాలనుండీ మహాధ్వని బయలు దేరింది.

ఎంత అప్రమత్తులై ఉన్నా చెలుకినాయని సైన్యాలు ఆ ధ్వనితో దద్దరిల్లి పోయినవి. కోటవైపునుంచి సైన్యాల వత్తిడి ఎక్కువయింది. విఠలధరణీశుని ఉరుములాంటి సింహనాదాలు చెలుకినాయని సైన్యాలదగ్గరగా వినపడుతున్నాయి. కోటవైపుతిప్పిన ఏనుగులమీద ఉన్న విలుకాండ్రను ఎడతెగకుండా పుంఖాను పుంఖాలుగా బాణాలు వదలండని చెలికినాయుడు ఆజ్ఞాపించాడు. కాని విఠలధరణీశుడు ఫలకాలను ఒక మహా ఛత్రంలా భల్లయుద్ధవిశారదులైన గండరగండలైన వెయ్యి మంది జోదులను ఒక తరంగముక్రిందను, వారివెనుక యింకొక వెయ్యిమంది విలు కాండ్రు రెండవ తరంగముక్రిందను, మూడు నాలు ఐదు తరంగాలక్రింద నూరేసి ఏనుగులను, ఆ తరంగములవెనుక ఆ ఐదువందలమంది ఆశ్వికులు చెలుకినాయని సైన్యాలమీద విరుచుకుపడ్డారు. ఏనుగులమీదనుంచి విలుకాండ్రు చెవి కంట నారులను లాగి రివ్వున బాణాలను వదిలిపెట్టుతూ ఉంటే ఆ బాణాలు మహిషాలమీద పడు వానచినుకుల్లా వృధా అయిపోతున్నవి.

అయినను ఒక్కొక్క బాణము ఒక్కొక్క భల్లధరుని ఫలకంలోంచి చొచ్చుకుపోయి ఆ వీరుని దేహంలోంచి దూసుకుపోయి ప్రాణాలు అపహరించే కాలాహి అవుతున్నది.

ఆ భల్ల వీరులు చెక్కు చెదరక అయిదారు బాహువుల మహాభల్లాలతో గజ యూధాన్ని తాకినారు. గజయుద్ధం చేయడం ఉత్కృష్టమైన వీరవిద్య. గజవేగం కన్న ఎక్కువవేగం కలిగి, తొండంపట్టుకు, దెబ్బకు తప్పికొని అతివిశమైన దీర్ఘ ఛురికలతో తొండమును కోసివేయకలిగి, మేరువులాంటి పాద ప్రహారాలను మెరుముల్లా తప్పించుకొనేవాడే గజయుద్ధవిశారదుడు.

వీరికి బాసటగా వచ్చిన ఆశ్వికులు పొడుగాటి వేణుదండాలకు చివరనూనెలో తడిపిన గుడ్డలనుకట్టి భల్ల వీరులు ఏనుగులను తాకగానే ఈ ఆశ్వికులు ఒక్క క్షణంలో చెకుముకులుకొట్టి ఈ పొడుగాటి కాగడాలు వెలిగించారు. ఆ కాగడాలు ఏనుగుల ముఖాలలోకి చొప్పించారు.

ఇదంతా కొన్ని నిమేషాలలో జరిగింది. ఒక్కుమ్మడి చెలుకినాయని ఏనుగులన్నీ భయపడి గీపెట్టుతూ వెనక్కు తిరిగాయి. మావటీలు ఏనుగులను