పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

75

బేడ చెలుకినాయని గుండెల్లో రాయిపడింది. ఇదివరదాకా చెలుకినాయుడు పరాజయం ఎరుగడు భల్లాణులపైన దండెత్తినప్పుడుగాని, కుంతలదేశముపై దండెత్తినప్పుడుగాని, ఎదిరి బలాబలాలను నిర్ణయించుకొని అందుకుతగినట్లు యుద్ధ వ్యూహం అమర్చుకొని, అతిజాగ్రత్తగా సైన్యాలనునడిపి, విజయాలు పొందేవాడు.

తన యుద్ధనిపుణత్వం మెచ్చి, చక్రవర్తి శ్రీ గణపతిరుద్రదేవులవారు ‘రణముఖభైరవ’ అని బిరుదము నిచ్చారు. ఎవడీ గోన గన్నడు? ఏమి వీడి ధైర్యము? వీడు అదృష్టవంతుడా, లేక మహావీరుడా?

ఎప్పుడూ భయ మెరుగని బేడ చెలుకినాయనికి మొదటిసారి కొంచెం గుండెల్లో అదటు ప్రవేశించింది.

తాను మొనలు నిలిపిన విధానం అర్జునుడు మెచ్చుకోతగినది.

కోటకు కొంచెందూరంలో నాలుగువందల ఏనుగులు, పదహారువందల విలుకాండ్లతో సిద్ధంగా ఉన్నవి. వారు వెనుకబలం. ఆ బలం బాసటగా ఆరాబోయే పదాతిదళం కోట ముట్టడించగలదు.

కోట ముట్టడికి ఏనుగులు రెండువందలు. ఈ ఏనుగులు గోడకు ముందుంచి పదాతులు రాగానే కోటతలుపులు పగులగొట్టించుటకు ఉపయోగించదలచుకొన్నాడు.

ఈ ఏనుగుల గోడకు వెనుకగా తాను ఇరువదివేలమంది ఆశ్వికులతో సిద్ధంగా ఉన్నాడు. ఈ అశ్వసైన్యానికి వెనుకగా మూడువందల ఏనుగులు సిద్ధంగా ఉన్నవి. ఒక్కొక్క ఏనుగుపై ఇరువురు నిలుచుండు విలుకాండ్రు, ఇరువురు కూర్చుండు విలుకాండ్రు సర్వసన్నద్ధులై ఉన్నారు.

తన మహానిస్సాణమున్న గజము తన రథానికి ముందుగా తన్ను రక్షిస్తూ ఉన్నది.

గోన గన్నారెడ్డి సైన్యం రెండుభాగాలై చీలిందట. గజాలు తుంగభద్రా నదిని దాటి వెళ్ళినవట. అశ్వికులు ఐంద్రీనదిని దాటి వెళ్ళిరట. పదాతిజనం చెలుకినాయని అశ్వికసైన్యానికి అర్ధగవ్యూతి దూరంలో ఆగిపోయినదట.

ఆ ఆగిపోయిన సైన్యము తాము నిలిచిన ప్రదేశం ముందు చిన్న చిన్న కందకాలు తవ్వుతున్నారట, నాపరాళ్ళ గోడలు చిన్నవి పేర్చుచున్నారట.

ఈ విషయం చారులు వార్త తేగానే చెలుకినాయుడు తొందరపడగూడదని ఆలోచించి, ఆదవోనినుంచి కాల్బలాలు, విలుకాండ్రు వచ్చేవరకూ వేచి ఉండాలని నిశ్చయించినాడు.

6

రాత్రి ఒకయామం జరిగింది. రెండవయామం జరుగుచున్నది. అంతా నిశ్శబ్దంగా ఉన్నది. కోటలో సైన్యాలు, కోటచుట్టూ సైన్యాలూ, కోట గోడల