పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

గోన గన్నా రెడ్డి

చారులు బేడ చెలుకినాయుడు ఆదవోని సైన్యాలతో ఎంతదూరం వచ్చిందీ, ఎటువస్తున్నదీ వార్తలు తెస్తున్నారు. చెలుకినాయుడు కందనోలు కడకు వచ్చేటప్పటికి కోట ఎటువంటి ముట్టడికైనా సన్నద్ధం చేయబడింది.

వందిభూపాలుని తనయుడు శ్రీ ముప్పరెడ్డి మహారాజు ప్రజ మెచ్చు గండడై, పతిహితాంజనేయుడై, గురుకార్యనిర్వహణానికి ప్రాణాలనైనా సమర్పించడానికి సిద్ధంగా ఉండెను. ముప్పరెడ్డి మహారాజుకు గురువు గజదొంగ గోన గన్నయ్య. ఆయన వాక్యమే అతనికి పరమమంత్రము. ఆయనకు యుద్ధనిర్వహణ విధానమంతా ఉపదేశించి, గన్నయ్య బేడ చెలుకినాయుడు రాకుండానే మాయమైనాడు.

కోటలో భీమునిలాంటి మహాసత్వుడు విఠలధరణీశుడు ముప్పరెడ్డికి బాసటగా నిలచి ఉన్నాడు. ఎక్కడచూచినా విఠలధరణీశుడే! మహోన్నతమైన అతనిరూపు చూచి ప్రజలందరూ ఆనంద మందుతారు. అపరభీమసేనుడని అతనికి పేరుపెట్టు కొన్నారు. విఠలధరణీశుని సాహసకార్యాలు దేశికవులు కావ్యాలుగా, గీతికలుగా రచించి పాడుతూఉంటారు.

తెల్ల నాపరాళ్ళతో నిండిఉన్న కందనోలు ప్రదేశమంతా ఎంతో విచిత్రంగా ఉంటుంది. కోటగోడలకూ, బురుజుగోడలకూ ఇతర ప్రదేశాలనుండి పెద్దరాళ్ళు తెప్పించి పూర్వప్రభువులుపయోగించారు.

చెలుకినాయుడు రెండునదులమధ్య కోటకు కొంతదూరంగా మొనలుతీర్చి నిలుచున్నాడు. ఏనుగుల కొన్నిటిని, ఆశ్వికులను తుంగభద్రకు ఆవల కాపుంచాడు. ఐంద్రీనదికి ఆవల కొన్ని ఏనుగులు, ఆశ్వికులు కాపలా కాస్తున్నారు. తాను తక్కిన సైన్యాలతో రెండునదులమధ్య కాపున్నాడు.

పదాతులులేక కోటపై బడుట మరణంతో సమానం. అందుకని చెలుకినాయుడు అప్రమత్తుడై, పదిహేను గవ్యూతుల దూరమందున్న ఆదవోనినుంచి సైన్యాలు ఎప్పుడు వస్తాయా యని ఎదురుచూస్తుండెను.

అర్ధయామము ప్రొద్దున్నదనగా ఆదవోనివై పునుంచి పదియేనువేలమంది విలుకాండ్లు, పదివేలమంది మూకబలము, నూరు ఏనుగులు, రెండువేలమంది ఆశ్వికులు వస్తున్నారని ఒక చారుడు తొందరగా వచ్చి తెలిపినాడు.

ఆశ్వికదళాలు ఎక్కడనుంచి వస్తున్నవి? రథసైన్యాలు రావటం ఏమిటి? నూరుగజాలు ఆ వచ్చేసైన్యంలో ఏమిటి? అని చెలుకినాయుడు ఆశ్చర్యపడుతూ,

‘ఎవరివా సైన్యాలు? ఎక్కడనుంచి వస్తున్నవి?’ అని ప్రశ్నించాడు.

‘చిత్తం మహాప్రభూ! అవి ఎవరివోనండీ. బహుశా గన్నారెడ్డి వేమోనండీ.’

‘ఏమిటీ! గన్నారెడ్డివే?’