పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

73

నప్పటికి సైన్యాలు కందనోలుకు రెండుగవ్యూతుల కెగువను తుంగభద్రను చేరినవి. అక్కడ మల్యాలవారి సైన్యాలు కందనోలుకు చేరినట్లు తెలిసి, కోటారెడ్డి మండలేశ్వరుని సైన్యాలను నడిపే శ్రీ బేడ చెలుకినాయుడు పటాటోపంతో వెళ్ళి కందనోలు ముట్టడించాడు.

బేడ చెలుకినాయుడు, ఆదవోని రాజ్యంలోని మోదుగల్లు దుర్గాధిపతి. మోదుగల్లు ఆదవోనికి ఇరువది గవ్యూతుల దూరము ఉంటుంది. కోటారెడ్డి ప్రభువునకు బేడ చెలుకినాయుడు మేనత్తకొడుకు. చెలుకినాయుడు పేరుమోసిన సేనాపతి. అతనికి బంగారు అంచులు, మణులుపొదిగిన బంగారు పూవులచే అలంకరింపబడి, పంచలోహాత్మక కలశం కలిగి, వెండితొడుగు గలిగిన మహాఢక్క ఉన్నది. అ నిస్సాణము పూర్వం ఇంద్రునిదట! ఇంద్రుడు రాక్షసులమీదకు పోయే సమయంలో, ఆ నిస్సాణము తనంతటతానే మ్రోగుతుందట! ఆ సహస్రమహామేఘ గర్జనకే లక్షలకొలది రాక్షసులు ప్రాణాలు కోల్పోయేవారట!

ఆ విజయనిస్సాణాన్ని ఇంద్రుడు చంద్రున కిచ్చెను. చంద్రుడు దానిని పురూరవున కీయగా, ఆతని వంశమునుండి పాండవులకు, వారినుండి కళ్యాణపురపు చాళుక్యులకు సంక్రమించినదట. వారివంశమువాడైన బేడ చెలుకినాయడద్దానిని ఆదవోని సైన్యమహావాద్యాన్ని చేసినాడు. చాళుక్యుడు చెలుకి అయినాడు.

ఆ మహాఢక్క బరువే ఒక అర్ధబారువు ఉంటుందట. దానిని మోయగలిగినది మహాగజాలుమాత్రమే. ఆ నిస్సాణాన్ని మోయించకలిగినవారు అజేయులైన ముష్టియుద్ధవిశారదులే.

ఆ దివ్యనిస్సాణము అనేకసముద్రా లొక్కసారి విరిగినట్లు, వేయి ఉరుము లొక్కసారి ఉరిమినట్లు కందనోలు ప్రజలకు వినబడసాగింది. ఆ మహానాదానికి శిశువులగుండె లవిసినవి. స్త్రీలు మూర్ఛపోయినారు. నాయకులు మ్రాన్పడినారు.

కందనోలుచుట్టూ తుంగభద్రానదీ, ఆనదిలోకలిసే ఐంద్రీనదీ ఉన్నాయి. ఈ రెండు నదులనూ కలిపే పెద్దకందకం ఉంది. కోటను ముట్టడించే సాధనాలూ ఒక లక్ష కాల్బలమూ పంపించవలసిందని చెలుకినాయుడు శ్రీ కోటారెడ్డి ప్రభువునకు అంచెవార్త పంపినవా డాయెను.

కందనోలుకోటలో వందిభూపాలుని తనయుడు శ్రీమల్యాల గుండాధీశుని దేవేరి కుప్పమాంబికారాణినీ, ఆదవోనిప్రభువు తనయను శ్రీ అన్నాంబికాదేవినీ సగౌరవంగా ఎదుర్కొని, రాచనగరులలో ఒక ఉత్తమహార్మ్యము వారికి విడిదిగా ఇచ్చినాడు.