పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

గోన గన్నా రెడ్డి

వెంటనే మహారాజుకు అమ్మాయిగారు నగరిలో లేరని తెలిపారు. గోన గన్నారెడ్డి శుద్ధాంతవనములోకి వచ్చినాడని ఎక్కడో అల్లరి పుట్టింది.

ఇంతలో రాకుమారి కనబడుటలేదన్న గగ్గోలు బయలుదేరింది.

5

గోన గన్నారెడ్డి ఆదవోనిలో ప్రవేశించాడని అల్లరి పుట్టించింది గోన గన్నారెడ్డి అనుయాయులే! ఊరంతా గగ్గోలు! ‘రాజకుమార్తె అంతఃపురంలో నుంచి మాయమైంది’ అనే వార్త రాజకుమారి కా శుద్ధాంతంలో కలిగిన గగ్గోలు వల్ల తెలిసిపోయింది.

రాజకుమారి పురుషవేషం వేసుకొని తన కతిసన్నిహితురాలైన చెలిమికత్తెను పిలిచి, దానిని ఒక పీఠమునకు బంధించి ‘నువ్వు ఏమీ అనుకోకు! నాకు గోన వరదారెడ్డిసాహిణిని వివాహం చేసుకోడం ఏమీ ఇష్టంలేదు. రేపు ప్రధానమహోత్సవము జరిగితే నేను ఒప్పుకొన్నట్లవుతుంది. ఈ పురము వెలుపల శ్రీ మాల్యాల గుండయమహేశ్వరుని దేవేరి శ్రీ కుప్పాంబ వచ్చి ఉన్నదట. నే నామెను కలుసు కుంటాను. నేను వెళ్ళగానే ని న్నెవరైనా వచ్చి విప్పిరా సరే, లేదా, నువ్వు విప్పుకున్న సరే తక్షణం నువ్వు మహారాణిగారికి తెలియజేయవచ్చు” అని చెప్పి మాయమైపోయిందట.

ఆదవోనిపురంలో ఎవరు దొంగలో, ఎవరు సైనికులో ఆ రాత్రి తెలియడము దుర్భరమే! తెల్ల వారేవరకూ సేనాపతులు, చారులు, ఆశ్వికులు పురంలో, నగరంబైటా, కోటలో వెతికారు. దొంగలజాడగాని, చిన్నదొరసానమ్మగారిజాడగాని ఎక్కడా తెలియదు. ఆదవోనిదగ్గర ఉన్న చిన్నపల్లె అరుంధతిపాలెంకడ ఆశ్విక సైన్యం, ఇరువది రథాలు, పది ఏనుగులు ఉండెనట. మల్యాల గుండయ ధరణీశు సైన్యాలన్నీ కలసి వెళ్ళిపోయాయట.

ఆదవోని మహాప్రభువు కోటారెడ్డికి మతిలేదు. ఒకసారి దుఃఖముతో క్రుంగిపోతాడు, ఒకసారి కోపంతో రుద్రమూర్తి అయిపోతాడు. ఒకసారి అవమానంతో మండిపోతాడు. కోటారెడ్డిప్రభువు సమీపంలోకి ఎవరు వెళ్ళగలరు? ముఖ్యమంత్రులు, ముఖ్య సేనాధిపతి, మహాకవి ఎవరూ ఆయన్ను తేరిచూడలేక పోయారు. ‘సేనలన్నీ ఆయత్తంచేసి కోట సంరక్షణకు పదాతిసైన్యం ఉంచి, సర్వఆశ్వికదళాలు, గజసైన్యాలు, రథాలూ తిన్నగా వెళ్ళి, జాడతీస్తూ ఆ మల్యాల సైన్యాన్ని నాశనంచేసి, ఆ కుప్పసానమ్మను, అమ్మాయినీబందీలుగా పట్టుకు రావలసింది’ అని కోటారెడ్డి ఆజ్ఞ ఇచ్చాడు.

వెంటనే ఉదయం ఆశ్వికసైన్యాలు, గజయూధాలు, రథాలు హుటాహుటి బయలుదేరినవి. మహావేగంతో చొచ్చుకపోతున్నాయి. మల్యాలవారి సైన్యాలు తుంగభద్రనది వైపునకు సాగిపోయాయని తెలిసింది. జాముప్రొద్దెక్కి