పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

గోన గన్నా రెడ్డి

ఇంతలో దుర్భర ప్రణయావేదనతో జేగురంది లేచినాడు దివిమీదకు యువ భానుమంతుడు.

“ఏదొ నా ఒడలిలో వేదనాజ్వర మొదవె
 ఈ తాప మిటు లొదివ నేమి కారణమొ?
 ఏదొ నా ........................................
 ఒళ్ళు ఝల్లనిపొంగు కళ్ళలో మత్తతలు
 ముళ్ళమీదను రథము వెళ్ళినట్లేతోచు”

ఆ సొబగుగాని పాట విని చిరునవ్వుతో పద్మినీబాల త్రపావతియై తల ఎత్తింది. వసంతము పద్మినీబాలది. వేసవి సంజ్ఞాదేవిది. శీతకాలంలో ఛాయాదేవి భర్తపజ్జ చేరుతుంది.

అన్నాంబికాదేవి ఇటూ అటూ తిరుగుతూ పూవులతో మాటలాడుతూ, కృతిమ శైవలిని ప్రక్కనే మెత్తని గడ్డిపైకూర్చుండి, ఉదయాన మహాసభలో జరిగిన వివాహలగ్నపత్రికాసమర్పణోత్సవమునుగూర్చి ఆలోచిస్తున్నది.

అన్నాంబికాదేవిని ఇందీవరాలోచన అన్న మహాకవి త్రిపురాంతకేశ్వరుని పలుకులు జ్ఞప్తికి తెచ్చుకుంటూ అన్నాంబిక చిరునవ్వు నవ్వుకొన్నది.

చెలికత్తెలను తనతో రావలదని ఆజ్ఞ ఇవ్వడంవల్ల, వారందరూ ఆవలనే దూరదూరంగా చుట్టుప్రక్కల పూలమొక్కలచాటున అన్నాంబికను కనిపెట్టు చున్నారు. ఆ చైత్ర బహుళ తదియనాడు చంద్రుడు ఆరు ఘడియలే ఆలస్యంగా వస్తాడు. చంద్రుడు వచ్చి పదిమెట్లు పైకి ఆకాశంమీదకు సాగగానే లోనికి వెళ్ళి పోదామని అన్నాంబిక కూర్చునిఉన్నది.

ఆకాశంలోని అరుణరాగాలు ఒకవిధంగా కరుణగలవే! ఆ రాగాలు కూడుకొని యువతుల హృదయాలలోనికి చేరుతాయి. అప్పు డా బాలల స్వప్నాల మాధుర్యం ద్రాక్షసారాయంలా మత్తు తాలుస్తుంది. ఆ అమృతము వారి పెదవులలో పోటెత్తుకు వస్తుంది. ఆ దివ్యసుధను ఆస్వాదించే నాయకులు మత్తు పొంది ఒడలు తెలియక తమ నాయికల ఎన్ని విధాలో చీకాకుపరుస్తారట.

ఈ విధంగా త్రిపురాంతకేశ్వరుడు తన వాసవదత్తా కావ్యంలో పద్యాలు రచించాడు. ఆ వృద్ధుని శృంగారరసవైచిత్రి అన్నాంబికకు నవ్వు పుట్టించింది. వృద్ధుని కిది ఏమివెఱ్ఱి అనుకొన్నదామె.

నేడు ఏదో అనిర్వచనీయ సౌందర్యము నీటిలో తేలిపోవు పుష్పపుటాలులా తనకు అస్పష్టంగా తోస్తున్నది. ఎందుకా పద్యాలన్నీ చీకటిపడే సమయంలో తన స్మృతిపథాన్ని ప్రత్యక్షం అవుతున్నవి?

ఆమె ధరించినది తెల్లని పట్టుశాలి నూలుచీర. సరిగపూలు అచ్చటచ్చట కుట్టిఉన్నాయి. మామిడి పిందెలతో అరచేతి వెడల్పు సరిగంచు. ఆమె తొడుగు కొన్న స్తనదుకూలకంచుకము వంగపండు చాయగలది. ఆ కంచుకము అంచులో ముత్యాలపూవులు కుట్టిఉన్నవి.