పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

67

వదినగార్లయిన వివిధ పద్మాలకన్న, సహోదరీమణులైన తెల్ల, ఎఱ్ఱ, అరుణ కలువలకన్న, ఈ నీలికలువ చిన్నది; అత్యంత మనోహరరూపం కలది. పొడుగాటి పూవు, కోలయైన రేకులు, అర్ద్రతను పుణికిపుచ్చుకొన్న అనన్య మనోహర నీలకాంతి ఆ కొనల నలమికొన్నది. ఆకాశనీలిమ ఆ నీలికలువకడ ఓనమాలు నేర్చుకోవలసిందే! చిన్నదైన ఈ కుసుమబాలికలోని నీలిమకు దీటైనది శ్రీకృష్ణడింభకుని సౌందర్యంలోనే గోచరిస్తుందట!

ఈ పూవుపుటాల పోలిక కనులుగల సుందరాంగులు సర్వప్రపంచంలో ఇరువురు మువ్వురు మాత్రమే ఉంటారట. వారిలో శిరోరత్నము అన్నాంబికాదేవి. ఆ కన్నులు అరమూతలో అనంతమాధుర్యాలను అందంగా దాచుకున్నవి. అవి తమ సోగతనంలో అమృతధారలను ప్రవహింపచేస్తాయి. అవి తమ లోకాతిశాయి నీలిమచే అనంత వినీలత్వాన్ని ప్రత్యక్ష మొనరుస్తున్నవి.

వసంతకాలం యువతీయువకుల తీయనిబాధ. యుగాలనుంచీ యువతీ యువకులదే ఆ కాలం. లోకాల యౌవనపు కోర్కెలన్నీకూడి వసంతమయింది.

తెల్లవారగట్ల కొంచెం చలితో వసంతమాస ప్రథమదిన ప్రారంభం. ఉదయమందు ఇక ప్రత్యక్షం కాబోవు సౌందర్యదర్శన కుతూహలానందమత్తత. వసంతభానుడూ నవయౌవనుడే! అతడు మత్తతతో లేవలేక కొంచెం వ్యవధిగా లేస్తాడు.

పుఁస్కోకిల-

“ఎచ్చటే పికబాల ఏమావినీడలో
 ఏతింత్రిణీ పల్ల వాచ్ఛాదనమ్ములో
 కువకువల కులుకుతూ కూర్చుంటి నిర్దయత
 కో కో యనుచు పిలుచు ఈ కృపణనే వినవు?”

అని విరహగీతిక పాడుకొంటున్నది.

    రసాలంలో పురుషపుష్పము ప్రియురాలిని వెదకుటకై తుమ్మెదను ఆపి,

“చెలికాడ తుమ్మెదా! పలు కిదే వినరార
 వలపు నా రాణి ఏ వలవంత పాలవునొ
 ఈ శాఖ విడనాడ నా శక్యమేగాదు
 పాశమై విధి నన్ను బంధించె నీరీతి
 నాలోని హృయదమ్ము నాలోని ప్రేమమ్ము
 నీలనీలములైన నీ పక్షములమోసి
 నా నాతి కర్పించి నా ప్రేమకథ తెలిపి
 నా ప్రాణసఖుడవై నన్ను రక్షించరా”

అనుచు షడ్జమశ్రుతి నాలపించెను.