పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

గోన గన్నా రెడ్డి

ఆదవోని మహాప్రభువులను అవమానంచేసి బ్రతికిపోయిన మగవా డింతవరకు ఎవడున్నాడు? ఏది ఎట్లయినా అన్నాంబిక వివాహం త్వరగా ముగించాలి.

ఈ నిర్ణయానికి రాగానే ఆదవోని ప్రభువు అంతరంగికురాలైన అంతఃపురపరిచారిక నొకరితను ఆలోచనామందిరంలోనికి రా నాజ్ఞ పంపినవాడయ్యెను. ఆమె వచ్చి ప్రభువునకు మోకరించి లేచి నిలుచుండి ‘ఆజ్ఞ’ అని చేతులు జోడించినది.

“నీవుపోయి, మహారాణిగారితో రాజకుమారికి మళ్ళీ వివాహముహూర్తము స్థిరమయిందనీ, బాలికల ఇష్టా నిష్టాలు ఉత్తమ రాజకీయాలకు అడ్డం రాకూడదనీ, రాజకుమారి భక్తితో వివాహసంసిద్ధయై ఉండవలసిందనీ మహారాణి నా ఆజ్ఞగా తెలియ జేయవలసిందనీ మనవిచేయుము.”

ఆ పరిచారిక చిన్ననాటనుండీ అంతఃపురాలలో పెరిగినది. అంతఃపుర స్త్రీలలో బలముకలవాళ్ళను ఏరి, యుద్ధవ్యవసాయనిపుణులుగా శిక్షనిస్తారు. వారు పురుషులతో సమంగా యుద్ధంచేయగలరు. అంతఃపుర రాజకీయాలు సాధారణంగా వారు పట్టించుకోరు. తమ ప్రభువులకు, దేవేరులకు అత్యంత భక్తితో సేవచేస్తూ అవసరమైతే ప్రాణాలు సమర్పించడానికి ఏమీ వెనుదీయరు.

ఆ పరిచారిక తిన్నగా మహారాణికడకుపోయి, ప్రభువు తన కప్పగించిన సందేశం వారికి మనవిచేసింది. మహారాణి ఆశ్చర్యమంది, అమ్మాయి వివాహం విషయంలో ఏలాటి విషమసమస్యలు తమరాజ్యానికి రానున్నాయో అని భయపడి, భవిష్యత్తు తమ కులదేవత విశాలక్షీదేవి కరుణవల్ల నే సుఖంగా పరిణమించాలని కనులుమూసి ప్రార్థించుకొన్నది.

2

తండ్రిగారి ఆజ్ఞ విన్నది అన్నాంబికాకుమారి. వివాహానికి రెండవ ముహూర్తము నిశ్చయమయిందని శుభలేఖలతో వర్ధమానపుర రాజపురోహితుడు ఇరవై ఐదు ఏనుగులతో, మూడునూర్ల ఆశ్వికులతో, వేయిమంది సర్వాయుధో పేతులగు సైనికులతో, బంగారు కట్టుల అందలం ఎక్కి ఆదవోని వచ్చాడు.

ఈ విధంగా ముహూర్త నిశ్చయ పత్రిక ఒక్క చక్రవర్తుల కుటుంబ వివాహ విషయంలోనే యాత్రచేస్తుంది. లకుమయారెడ్డి ప్రభువునకు తన హృదయంలో చక్రవర్తిత్వం సిద్ధింపనే సిద్ధించింది. మండలేశ్వరులలో తనకున్న సైన్యబలం ఇంకెవరికి ఉన్నది! ఒకలక్ష విలుకాండ్లను లకుమయారెడ్డి ప్రభువు సన్నద్ధం చేశారు. మూడునూరుల పోతరించిన మదగజాలు, పదియేను వేలమంది రాహుత్తులు, మూకబలగం మూడులక్షలూ, వేయి రథాలు