పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

59

ఉంటారు. వారిని సంహరించడానికి దేవియే రుద్రదేవిగా ఉద్భవించి ఉంటుంది. అందుకని ఈ బాలికను కొమరునిగా పెంచవలసింది. తర్వాత కొమరుడు పుట్టితే, అప్పు డీమె బాలికయని తెలుపవచ్చును సార్వభౌమా!’ అని ఉపదేశించినారట. చెల్లీ! అప్పటినుండి నే నట్లా పెరిగినాను. వీరవిద్య లన్నీ నేర్చాను. నువ్వు నాబిడ్డవు. నువ్వు నా చెల్లివి. నా గర్భాన్ని కొమరుడు కలక్కపోతే నీపుత్రుడే నాకు పుత్రుడౌతాడుదేవీ! నువ్వు జాయపసేనాని కొమరితవు. ధైర్యంవీడి మొరకు స్త్రీలా ఈలా దుఃఖిస్తారా? నువ్వు కోరిన మహాపురుషుడు దేవలోకంలో ఉన్నా వానిని బట్టితెచ్చి నీకు సమర్పిస్తాను. మేమంతా చేసిన ఈ అన్యాయానికి క్షమించానని నా హృదయంమీద వ్రాలు” అని రుద్రమదేవి కంట తడిచేసినది.

ముమ్మడాంబిక రుద్రదేవి మోము నిమేషమాత్రం తిలకించి, కన్నీటితో తడిసిన పెదవులపై, మేఘాలమీద నిర్మలాకాశంలో వికసించిన పూర్ణచంద్రునిలా, నవ్వు వెలుగుతూ ఉండగా రుద్రమదేవి హృదయంమీద వాలింది.