పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

53

అనంగభీముని తాకవలసింది. ఈ రెండు మహాగ్నులమధ్య పడి కాళింగుడు నాశనమైపోవుగాక.

శివ : ప్రభువు చక్కగా ఆలోచించారు. అదే సమంజసమయిన యుద్ధ యాత్రావిధానము.

రుద్ర : బాబయ్యగారూ! తాము మన ఆలోచనకు తగిన ఆజ్ఞలు పంపించండి. ఇంక మేము సెలవు తీసికొనవచ్చునా?

మువ్వురూ వారివారి పీఠాలనుండి లేచిరి. శివదేవయ్య, చాళుక్య వీరభద్రుడు నిజమందిరముల కేగిరి.

వా రిరువురు వెళ్ళినను, యువమహారాజు తిరుగ తన ఆసనంమీద అధివసించినారు. ఇంతలో దౌవారికుడు లోని కరుదెంచి “జయము జయము మహా ప్రభూ! శ్రీ విరియాల గొంకప్రభువు వేంచేసినారు” అని విన్నవించెను.

మహారాజు వారిని ప్రవేశపెట్టుమని అనుజ్ఞ ఇచ్చెను. ఇంతలో వేగుదళ నాయకుడు గొంకప్రభువు లోనికి విచ్చేసి రుద్రదేవమహారాజుకడ మోకరించి, లేచి, ప్రభువుచూపిన ఉచితాసనంపై అధివసించి “మహాప్రభూ! గోన గన్నయ్య చండప్రచండుడు. ఆదవోని ప్రభువుకు సామంతుడు కోసగిమైలి, గన్నారెడ్డి సైన్యాలతో తుంగభద్రాప్రాంత అరణ్యాలలో ఉన్నాడని తెలిసి పదిదినాలలో హుటాహుటి ప్రయాణంచేసి ఆ మహారణ్యం చేరుకున్నాడు.

“గన్నయ్య సైన్యాలతో మూడు గవ్యూతులలో ఉన్నాడనిన్నీ, తమ రాక అతనికి ఏమీ తెలిసినట్లు లేదనిన్నీ వేగులు విన్నవించుకున్నారు. కోసగినగర ప్రభువు మైలపనాయకుడు చిరునవ్వు నవ్వుకుంటూ అశ్వదళాన్ని తూర్పుగా పొమ్మన్నాడు; పడమటగా గజయుధాన్ని సాగమన్నాడు. తాను రధాలతో కాల్బలాన్ని నడుపుకుంటూ వస్తున్నాడు. ఉత్తరంగా సగం కాల్బలం తుంగభద్రఒడ్డుననే వచ్చి గన్నయ్య సైన్యాన్ని పొదువ మన్నాడు. భేరీలు ఢం ఢం ఢం, ఢాం ఢాం ఢం ఢం ఢం అని మ్రోగగానే ఆ గుర్తుకు అన్నిసైన్యాలు సాగా లనిన్నీ గుర్తు చెప్పాడు.

“గన్నారెడ్డి సైన్యాలు ఒక అర్ధగవ్యూతిలో ఉన్నవనగా భేరీలు సంకేత ప్రకారం మ్రోగించాడు. అనేకవేల దుక్కుల కుంభవృష్టి కురిసినప్పుడు పొంగి ఉరికే ప్రళయతుంగాజలాలులా సైన్యాలు ముందుకు ఉరికాయి. ఆ మహోన్నత వృక్షాలలో, ముళ్ళడొంకల్లో సైన్యాలు పెళ్ళున ఉరికినవి. ‘ఆఁ’ అని అనే లోపలే ఇంకో కాల్బలం ఎదుటబడింది. గుర్రాలు కుడివైపునుంచి, ఏనుగులు ఎడమవైపు నుంచి దావానలం కప్పినట్లు, కొండలు విరుచుకు పడ్డట్లు వచ్చినవి. నాల్గుసైన్యాలు ఒకదాని నొకటి తాకి, ఆ వట్టితాకడంవల్ల కొన్ని కాల్బలాలు, అశ్వాలు, ఏనుగులు హతమారినవి.

“అన్నిబలాలు కళ్ళుతెరచి తాము తమ్మే చంపుకుంటున్నామని తెలుసుకొనే లోపలే ఆకాశంనుంచి భయంకరమైన బాణాలవాన మనుష్యుల్ని, అశ్వికుల్ని,