పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

51

ఎవ రా దేవి? ఏ లోకాలనుండి దిగివచ్చింది? ఎందుకు వచ్చింది?
కాకతీయ కులదేవత కాకతీదేవియా? ఆమెకు సైదోడు ఏకవీరయా?

ఈ లాంటి అందం లోకములో ఉండదు. ఆమె స్త్రీ కాదు, సౌందర్యవతీ కాదు! ఆమె స్త్రీ త్వాతీతమైన ఒక మహాభావం, సౌందర్యమూలమైన దివ్యాతి దివ్య సౌందర్యం! ఆమె స్వప్నాలమించిన స్వప్నం! ఎవ రీ బాల? వెన్నెలలో వచ్చి వెన్నెలలో కరిగిపోయినది. “నువ్వెవరవు దేవీ! అచ్చరలను నలుపు చేయ నారాయణు డూర్వశిని పుట్టించాడు. ఆ ఊర్వశీ దివ్యతేజస్సును మిణుగురు నొనర్చు మహాతేజస్సువా?” తన కా నిమేషము చైతన్యమే తప్పినది. కన్నులు మూతలు పడలేదేమి? తన పెదవులు మాటలేని కదలిక అయినా పొందలేక పోయిన దేమి?

ఈ మూర్తి తనకు సన్నిహితము, దూరమును! ఆ బాలికనలో తాను కనిన స్వప్నాలు, తాను రచించుకొన్న అమృతగానాలు, అణువులై ఈ రూపును పొందినవే. క్షణమాత్రం కన్నులు మూసుకొన్న తన కర్ణాలకు ఆమె సౌందర్యాలు ఏవో శారద వీణాగానాలై వినిపించిన వేమి?

దేశికు లీ సౌందర్యదర్శనానికా న న్నీ వనంలో, వెన్నెలలో వదలి వెళ్ళి పోయారు?

తనతో ఆఖేటక్రీడకు వేంచేసిన ఒక గుప్తభావము, సర్వగోప్యాలువదలి తన కీ పవిత్ర ముహూర్తంలో ప్రత్యక్షమైనదా?

“దేవీ! ఆంధ్ర ప్రజాహృదయ నటద్దివ్యచరణ స్వర్ణమంజీర గానజీవితా! ఈ పవిత్రక్షణమే నాకు సర్వానుభూతిపుంజమై, ఇంకనుంచి ఒక్కణ్ణే ఈ జీవిత పథాల్లో యాత్రచేయ ఆదేశించినావా?”

ఆతడు కరగిపోయినాడు. గంభీరజీవియై, మహావీరుడై, అతిరథుడై, దుష్ట తురగ రేఖారేవంతుడై, గజసాహిణై, నరలోకసుందరుడై, శత్రుమత్తగజసింహమైన ఆ ఉత్తమచాళుక్యుడు త న్నలమివేసిన లోకోత్తరప్రేమశక్తిచే కరగి, అమృతబిందుద్వయాంకితలోచనాంచలు డయ్యాడు.

“ఏమయ్యా వీరభద్రప్రభూ! వెన్నెలలో స్వప్నాలు కంటున్నావా? మూయబడిన ఆ గుమ్మంవంక అరమూతలు కన్నులు చూచేవు ఏ మహానిధి ఆవెనుక ఉందనుకున్నావు?”

శివదేవయ్య మాటలు స్వప్నమధ్యంలో సముద్రఘోషలా వినబడి, వీరభద్రప్రభువు ఉలిక్కిపడి సిగ్గుతో వివర్ణముఖుడై, మరల ధైర్యం చిక్కబట్టి, “ఒక దేవీ ప్రత్యక్షమై మాయమైనది - గురుదేవా!” అన్నాడు.

శివదేవయ్య, ఆ ఇరువురు త్రిలింగదేశ మహావ్యక్తులూ ఒక్కముహూర్త మాత్రం తారసిల్లి విడిపోవడం చెట్లచాటునుండి గమనించినాడు. ఆయన గమనించి నాడని చాళుక్య వీరభద్రుడు గ్రహించుకొన్నాడు. వీరభద్రుడది గ్రహించాడని శివదేవయ్య దేశికులు అర్థంచేసికొన్నారు.