పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

49

తన్ను తదేకదీక్షతో గమనిస్తారేమి? ఆ మహాభాగుడు శ్రీరామునిలా ఏకపత్నీ వ్రతుడు కాగలడా? కాకపోయిన తనకేమి? ఆయన శ్రీకృష్ణునిలా పదారువేల మంది గోపికలను చేసుకుంటే తనకేమి? విష్ణువు బహుభార్యాప్రియుడు, పరమశివునకును గంగవిషయంలో బహుభార్యాత్వదోషం సంభవించినది. కాని శ్రీరామున కేకపత్నీత్వవ్రతఫలం దక్కింది. బ్రహ్మకూడా ఏకపత్నీవ్రతుడేనట. వీరభద్ర మహాభావానికి జాయ భద్రకాళి. ఆమె రుద్రభావమే!

తనతల తిరుగుచున్నది. కొంచెంసేపు పెద్దతోటలో తిరిగి మరీ రావచ్చును. వెన్నెల ఎంతో అందంగా ఉంది.

రుద్రాంబిక అంతకన్న అంతకన్న బాలిక అయి తలుపు చేటికనే తెరిపించి బాహ్యవనంలోనికి అడుగిడి నడిచింది.

శీతాకాలం గడచి వసంతకాలం చిన్న బాలకునిలాతోటలో ఆడుకుంటున్నది. మల్లె అంటులన్నీ చిగిర్చి మొగ్గలు తొడిగినవి.

మావిచెట్లన్నీ చిగురించి ఒత్తుగా పూతలతో పిందెలతో నిండిఉన్నాయి. అరటిబోదెలలో గెలలు సహస్రఫ్రణాలతో విష్ణునిపై వంగు శేషునిలా ఉన్నవి. వకుళపత్రాలు ఆవనం అంతాపరీమళాలు నివిరజిల్లుతున్నవి. సప్తమినాటి చంద్రుడు వెన్నెలతో హృదయాల లోతులను కలతపెట్టుతున్నాడు.

ప్రక్కనే ఒంటిమిట్ట, దూరంగా చిన్నకొండలు మేఘాలులా ఆకాశంలోకి తొంగిచూస్తున్నవి. లేడి రాణిలా దిక్కుల నాఘ్రాణిస్తూ, హంసలా నడుస్తూ క్రీడా సరస్సుకడ కామె చేరినది. ఆ వెన్నెలలో నీలి కలువపూలు అప్పుడే వయస్సు వచ్చిన కన్యహృదయంలా సౌరభాన్ని వెదజల్లుతున్నవి. ఆమెవంగి నీటిలోనుండి కాడతో ఒకపూవు పెరికి నీటిని తన పయ్యెద కొంగుతో తుడిచి, నిలుచుండి ఆ పూవు నాఘ్రాణించుచు ఎదుట ఒక పురుషునిచూచి, అలాగే మ్రాన్పడిపోయింది.

ఆ పురుషుడు ఈ దివ్యమూర్తిని చూచి చేష్టలుదక్కి అట్లే నిలుచుండి పోయినాడు.

8

ఆ పురుషుడు చాళుక్య వీరభద్రుడని గ్రహించగానే రుద్రదేవి గజగజ వణకినది. ఈ పురుషుడుకాదూ తన హృదయమంతా నిండి, తన జీవితమంతా ప్రసరిస్తున్నది? ఈ పురుషుడుకాదూ తాను చేయదలుచుకోని ఈ స్త్రీ వేషధారణము తనచేత చేయించింది?

ఈ కాసే వెన్నెలమూర్తిలా ఉన్నాడీ మహాభాగుడు. తా నెప్పుడూ చేయని మూర్ఖకార్యం చేసి, ఈ ఉత్తముని కంటబడినది. అతడు తన్నేమనుకొనునో? అతడు నిజం గ్రహించునా? గ్రహిస్తే ఏమిగానున్నదో!