పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

గోన గన్నా రెడ్డి

గణపాంబ బేతరాజుసౌందర్యం కవులు పాడగా విన్నది. ఆయన తన భర్త అని తండ్రి నిర్ణయించిన మరుసటి క్షణంలో ఆమె విరిసిన దిరిసెన పూవులామంజులత తాల్చినదాయెను. ఆమె విశ్వాధినేత నారాయణుని చేపట్టు వార్నిధికుమారిక కమలాలయలా ఒప్పినదాయెను.

చెల్లెలి వివాహవైభవము తలచుకొంటూ, తాను తండ్రికి దక్షిణభుజమై వెలనాటిచోడుల సామంతుల జయించి తెచ్చిన ధనరాసులు తన చెల్లెలికి స్త్రీధనంగా ఇచ్చిన దృశ్యము భావిస్తూ రుద్రదేవి పులకాంకురములు దాల్చెను.

ఆనాటి వేషమేమి? ఈనాటి వేషమేమి? తన ఈనాటి వేషంకన్న, భర్తను చేరబోయే తన చెల్లెలు గణపాంబాదేవి ఎక్కువ అందంగా ఉండెనా? కాక! ఆమె బాలికగా పెరిగెను. రాజకన్యలు నేర్వవలసిన విద్యలన్నీ బాలికవలె నేర్చుకొన్నది. ఆమె నిశ్శంకగా తమ సవతితల్లుల అన్నగారు శ్రీ జాయప మహాప్రభువు శిష్యురాలై నాట్యం నేర్చుకొన్నది. తాను బాలునిలా నేర్చుకొన్నది, హావభావవిలాసాలలో చెల్లి ముద్దులు మూటగట్టే ఉషాదేవిలా ఉంటే తా నొక ఆడంగి అబ్బాయిలా నాట్యం నేర్చుకొన్నది.

తన చెల్లి మహావిద్వాంసుడైన మహావైణికుడు శ్రీ సత్రము బొల్లమరాజార్యునికడ సంగీతమును, సర్వవిద్యలు వేదస్వరూపులైన ఈశ్వరసూరి పండితులు విద్యాగురువుగా తనతోపాటు నేర్చుకొన్నది. పాడే సమయంలో తన గొంతుక చెల్లెలి గొంతుకలా పంచమస్వర శ్రుతినే పలికేది. అందుకని తానెప్పుడు మంద్రస్థాయిలో పాడుకొనునది.

ఏమి టీ ఆలోచనలు? ఎందుకు ఈ సాయంకాలము శ్రీ బాబయ్యగారు, శివదేశికులవారు తనతో రాచకార్యాలు మాటలాడడానికి వస్తామన్నారు? లోనికి పోవాలి! అయినా వారు రాగానే వార్త వచ్చునుకదా! ముమ్మడమ్మ ఎంతవెఱ్ఱి బాగులబాలిక! తన్ను పురుషునిగా ఎంచి సీత రాముని ప్రేమించినట్లు ప్రేమించినది పార్వతి శివుని ప్రేమించినట్లు ప్రేమించినది. పాపం, ఆ బాలికకు నిజం తెలిస్తే ఎంత బాధపడుతుందో? స్త్రీల హృదయం తనకు తెలుసును. తనకు మాత్రం తనహృదయం తెలుసునా! స్త్రీహృదయం స్త్రీకే తెలియదా? ఏ సమయానికి స్త్రీహృదయం ఏవిధంగా ప్రసరిస్తుందో స్త్రీకిని తెలియదు. తాను స్త్రీహృదయమూ, పురుషహృదయమూ తెలియలేని శిఖండి లా ఉండెను కాబోలు? పురుషుల హృదయం స్త్రీలకు నిమిషంలో అవగతం అయితీరుతుంది.

చాళుక్య వీరభద్ర ప్రభువు హృదయం ఏ రీతి ప్రవర్తిస్తున్నదో తాను గ్రహింపగలుగునా? పెండ్లికాని బాలికలవంక వారెట్లుందురో యను జిజ్ఞాసచే ఆయన తలెత్తిచూడడు. తాను బాలికనని ఆయన గ్రహించెనా? అట్లు