పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

గోన గన్నా రెడ్డి

పెళ్ళికొమార్తె పెదతండ్రి పృథ్వీనాయకుడు, పినతండ్రి నారపనాయకుడు, వారి తండ్రుల బిడ్డలయిన కమ్మనాటి ప్రభువులు, రుద్రదేవుని ఇరువురు మేనత్తలు, గణపతిచక్రవర్తి చెల్లెళ్ళయిన మైళమాంబ, కుందాంబదేవుల రాజ్యమైన నతనాటిసీమ కధిపతులైన మహామండలేశ్వర రుద్రదేవరాజు తన ఇద్దరి దేవేరులతోను, బుద్దపురమునుండి మల్యాల గుండయమహారాజు, వర్ధమానపురమునుండి గోన లకుమయారెడ్డిప్రభువు, ఆదవోనినుండి కోటారెడ్డిమహారాజు, కందూరునుండి కేశినాయకప్రభువు, కందవోలునుండి నందిభూపాలుడు, కల్యాణమునుండి చోడోదయ మహారాజు, కోసగినుండి మైలపదేవుడు, రేచర్లవంశమహావీరుడు రుద్రప్రభువు, పిల్లలమఱ్ఱినుండి బేతిరెడ్డిప్రభువు, నాగులపాటినుండి విరియాలవారు, పమ్మి ప్రభువులు, ముప్పవర ప్రభువులైన పంట మల్లి రెడ్డి ప్రభువులు వివాహానికి వేంచేసినారు.

6

వివాహం అఖండవైభవంగా జరిగింది. నెలరోజులు దేశమంతా ఉత్సవాలు జరిగినాయి. రాజధానీనగరమైన ఏకశిలానగరం అంతా గంధర్వ నగరమైపోయింది. ఆ నగరాలంకారములో ఆకాశపు పందిళ్ళు, ఏనాటికానాడు పచ్చటి మామిడాకు తోరణాలు, అరటి స్తంభాలు, పూవులు రంగు రంగు అద్దకాల మేల్కట్టుల తెరలతో వెలిగిపోవుచుండెను. నగరమంతయు భోజనశాలలు; ఆ శాలల్లో వివిధదేశాల వివిధరుచులకు తగిన శాల్యన్నాలు, గోధుమరొట్టెలు, వివిధశాకాలు, పచ్చళ్ళు, తొక్కులు, పులుసులు, చారులు, పిండివంటలు, చిత్రాన్నాలు, షాడబాలు వడ్డించు చుండిరి.

ప్రతిదినమూ కవి పండిత గాయక నాట్యగోష్ఠులు, రాత్రికాలాల యక్ష గానాలు, తోలుబొమ్మలాటలు జరుగుచుండెను.

గురు, మహాప్రధాన, సామంత, సేనాపతి, ద్వారపాలక, అవసరిక, ఘటికా నిర్థారక, నటక, లేఖక, పౌరాణిక, పురోహిత, జ్యౌతీషక, కార్యజ, విద్వాంసక, దేవతార్చక, మాలాకారక, పరిమళకారక, చేష్టాధికార, గజాధికార, అశ్వాధికార, భాండాగారాధికార, ధాన్యాధికార, అంగరక్షక, సూత, సూద, భేతాళమత, తాంబూలిక, తాళవృంతక, పల్యకింకావాహక, ఛాత్రిక, దామరిక, కరాచిక, శారికాకీరమాలిక, పాదుకాధార, వర్తక, గాయక, వైణిక, శాకునిక, మాగధ, వైతాళిక, స్తుతిపాఠక, పరిహాసక, క్షారక, రజక, సౌచుక, చర్మకారక, ముద్రాదికారక, పురపాలక, గజవైద్య, అశ్వవైద్య, పశువైద్య, భేరీవాదక, మురజవాదక, కుంభకారక, చిత్రకారక, వ్యావహారక, మృగయ, పక్షివాహక, పణిహారిక, ఉగ్రాణాధికార, వైశ్యజనాదిగా డెబ్బదిరెండు నియోగాలవారు, వానిపై మహామండలేశ్వరు