పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

43

ముమ్మడమ్మ ఒళ్ళు ఝల్లుమంది. ఆమె కపోలాల చిరుచెమటలు పట్టినవి. ఆ పరుగు పరుగు ఆ వనంలో ఉన్న ఒక క్రీడాసరోవరంకడ ఆగింది. అక్కడ అనేకులు బాలబాలికలు ఉయ్యాల లూగుతున్నారు. ముమ్మడాంబను చూచి, రాకుమారికలు కొందరు వయ్యారాల నడకలతో ఆమెకడకు వచ్చి ఆమెను మేలమాడ చొచ్చిరి.

రుద్రదేవునికి తాను బాలికనని అంతకుముందు విజయదశమి ఉత్సవాలకే తెలిసినదికదా? ఇప్పుడు ముమ్మడమ్మ మాటలకు యువరాజుకు ఎంతో నవ్వు వచ్చింది. తన్ను బాలికలందరు ప్రేమించుట కారంభింతురు కాబోలు నని ఆ ప్రభువు మరింత నవ్వుకొన్నారు.

ఈలా ముమ్మడమ్మ రుద్రదేవుల నాటకం జరిగి జరిగి చతుర్థాంకాన వారి కిరువురకు వివాహ మైనది. జాయపసేనానికి గణపతిరుద్రదేవ చక్రవర్తియు, శివదేవయ్య మంత్రియు రుద్రమదేవి రహస్య మెరిగించి, ఆంధ్రమహారాజ్య సంరక్షణార్థము రుద్రదేవికి స్త్రీని వివాహం చేయవలసి ఉన్నదనిన్నీ, అందుకు చిన్ననాటి నుండీ కలసిమెలసి పెరిగిన ముమ్మడమ్మను రాజకుమారునికి వధువుగా తాము నిశ్చయించామనీ, చక్రవర్తి బావమరిదియు, రాజభక్తిపూరితుడును, ఉత్తమ సంస్కారియు, మహాసేనానాయకుడు నగు జాయపనేని అందు కేమీ అభ్యంతరము చెప్పడని తమ భావమనియు తెలిపిరి. జాయపసేనాని సంతోషంతో ఒప్పుకొన్నాడు.

రుద్రదేవప్రభువు స్త్రీయని లోకానికి తెలిపేకాలం వచ్చేసరికి ముమ్మడమ్మను రుద్రదేవితోపాటే ఒక ఉత్తమ మండలేశ్వరున కిచ్చి వివాహము కావింతమని శివదేవయ్య మంత్రి జాయపసేనానికి చెప్పినాడు.

శ్రీ శ్రీ కాకత్య మహారాజవంశచంద్రుడైన యువరాజు శ్రీ రుద్రదేవ ప్రభువునకూ, శ్రీ శ్రీ జాయపమహారాజపుత్రిక ముమ్మక్క సానమ్మ దేవేరికి అఖండవైభవంగా వివాహం అయింది. సింహాద్రినుండి కంచివరకు, మోటుపల్లినుండి కళ్యాణపురివరకు గల మహామాండలికులు, మహాసామంతులు, రాజబంధువులు, రాజ ప్రతినిధులు, మహామంత్రులు, మాండలికులు, సామంతులు, మహాకవులు, గాయకులు, కృష్ణవేణీతీరస్థ కూచిపూడి నటకులు, నర్తకీమణులు వేంచేశారు.

నిడుదప్రోలు రాజ్యప్రభువులు శ్రీ ఇందుశేఖర చాళుక్యమహారాజు వేంచేసినాడు. సారసపురాననుండి శ్రీ ఇందులూరి సోమరాజమంత్రీ, ఆయన తమ్ముడు శ్రీ పెదగన్నణమంత్రీ దయచేసినారు. వేంగీ విషయాధినాథుడు కాలపనాయక మహారాజును, నిర్మలమహాపురినుంచి చౌండసేనాధిపతియు, అద్దంకినుండి సారంగపాణి దేవమహారాజు, గుడిమెట్టనుండి శ్రీ సాగిచాగరాజమహాప్రభువును, ధరణికోటనుండి మహామండలేశ్వర కోటరుద్రమహారాజును, అతని పుత్రుడు బేతమహారాజును, సప్తగోదావరీ మధ్యదేశ కోనమండలాధిపతి హైహయ శ్రీ కోనరాజ మహారాజును,