పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

గోన గన్నా రెడ్డి

ఒకతూరి వసంతోత్సవసమయంలో ముమ్మడాంబిక వనదేవత వేషం ధరించి, వసంతవేషముతో రుద్రదేవ యువరాజు ఒంటిగా వసంతోద్యానవనాన సంచరించే సమయాన, పదునారేడుల ఈడుగల ఆ ముద్దులగుమ్మ వెనుకగావెళ్ళి ఆ యువరాజు కళ్ళుమూసింది. రుద్రప్రభువు ఉలికిపడి ‘ఎవరు?’ అని తొందరపాటుగా ప్రశ్నించెను.

‘బావగారూ ! నా పేరు చెప్పుకోండి?’

‘ఓహో! నా ప్రియురాలు ముమ్మడాంబికాదేవా?’

‘నెగ్గారు మీరు’ అని ముమ్మడాంబిక చేతులుతీసి ‘నేనే ఓడిపోయాను ఏమి చేయమంటారు?’ అని ప్రశ్నించింది.

‘అదిగో ! ఆ పొదరింట కూచుందామంటాను.’

వా రిరువు రా ప్రక్కనున్న పొదరింటిలో కూర్చుండిరి. ముమ్మక్క దేహం వేడెక్కిపోయినది. భరించరాని సిగ్గు, ఎవరైనా వస్తారేమోనన్న భయం!

‘ముమ్మడాంబికాదేవీ ! మొన్న మా చిన్న అమ్మగారి సౌధాలకు వస్తే, మీ రెక్కడా కనిపించలేదే?’

నేను మిమ్ము చూడకూడదని అత్తయ్యగార్లిద్దరూ ఆంక్షలు వేశారండీ, కాని మిమ్ములను చూడనేచూశాను.'

‘మీరు దినమూ ఏమి చేస్తూ ఉంటారు?’

‘నాన్నగారి సహాధ్యాయ గొంకనభట్టువారు నాకు నాట్యమూ, సంగీతమూ, సాహిత్యమూ చెప్పుతున్నారు.’

‘ఈ మధ్య మీ నాట్యము నేను చూడనేలేదు. మామయ్యగారు రచించిన నృత్తరత్నాకరము అంతా చదివాను. చదువుతోంటే నాకు ప్రతిక్షణమూ నాట్యం చేయలనే బుద్ధి!’

‘బావగారూ! మీతో ఆటలు ఆడకూడదని మా అత్తయ్యగార్లు నిషేధించి నప్పటినుండీ నాకు మతి.....మతి.....పూర్తిగా ...పోయినట్లే ఉంది. నా నాట్యం మీకు నిజంగా చూడాలని ఉందా?’

‘తప్పకుండా నాట్యం చేయలేను కాని, నాట్యం చెయ్యాలని ఎంతో ఊహ! కాని నన్ను మహారాజు నాట్యం చూడకూడదన్నారు. దేవాలయాలలోకి వెళ్ళవద్దన్నారు.'

‘బావగారూ! రేపు అత్తయ్యగార్ల నగరులకు రండి. నా దాసి బెమ్మక్క మహామందిరములో నుంచుని ఉంటుంది. అప్పు డది ఏలా తీసుకువెడితే ఆలా రండి! మీరు మాటిచ్చారు సుమండీ! మరచిపోకండి.’

ముమ్మడమ్మ రుద్రదేవుని మెడ గట్టిగా కౌగిలించుకొని నున్నని చెంప ముద్దిడుకొని, మరుక్షణంలో మాయమైనది.