పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

41

“బావగాలూ, ఇవాల మనం ఇద్దలం ఏమి ఆలుకొందాం?”

“ఏమిటి ఆడుకొందాం మమ్మక్కదేవిగారూ?”

అప్పుడు ముమ్మక్క దేవికి మూడేళ్ళు. రుద్రప్రభువునకు అయిదేళ్ళు. పెదమహారాణిగారి నగరికి దాసీలు ఎత్తుకొని ముమ్మక్కదేవిని తీసుకొచ్చేవారు.

“బావగాలూ, నన్ను ఈ బెమ్మక్కలాచ్చసులు ఎత్తెకుపోయాలంట, మీరు గుల్లం ఎక్కి కత్తీ పుత్తుకొని, ఆ లాచ్చసున్నీ దలిమికొత్తి, తరిమేత్తాలుత. అప్పులు వత్తి నన్ను లత్తిత్తాలుత.”

“బాగుంది ముమ్మక్కగారూ ! నేను కత్తిపుచ్చుకు సిద్దంగా ఉన్నాను” అని బాలరుద్రదేవుడు (రుద్రదేవి) తన మొలలో కట్టిన చిన్న కత్తిని పుచ్చుకొని, దాసీ బెమ్మక్కను తరుముకు వెళ్తూ “రాచ్చసీ చంపివేత్తాను! నువ్వు అనగా అనగా నారాజపుత్త్రికను ఎత్తుకుపోతావా?” అంటూ ఆమెను పొడిచినట్లు నటించారు.

బెమ్మక్క ఘాండ్రుమంటూ ఆ తోటలోని గడ్డిలో విరుచుకు పడిపోయింది.

రుద్రదేవుడు ముమ్మక్కకడకు పరుగిడి ‘రాజకుమారీ! నిన్ను రాచ్చసుని చంపి రచ్చించి మాదేశము తీసుకు వెలుతున్నాను’ అని తెల్పి ఆమె చిన్నచేతులు పట్టి లేవనెత్తి తనతోవచ్చు యింకొకదాసీకి అప్పచెప్పుతూ ‘తక్కిన రాచ్చసుల్ని కూడ చంపివేత్తాను’ అన్నారు.

5

ఆటలలో, పాటలలో, చదువులో శ్రీకాలరుద్రదేవ ప్రభువును, శ్రీ ముమ్మడమ్మయు ఎప్పుడూ కలుస్తూ ఉండేవారు. ముమ్మక్క రుద్రదేవుని చూడక ఒక్క దినమైనా వెళ్ళనిచ్చేదికాదు. రుద్రదేవుడు నీభర్త అని అందరూ అంటూవుంటే ముమ్మడాంబికకు సంతోషం పొంగిపోయేది. రుద్రదేవుని కలుసుకొనడానికి వెళ్ళినప్పుడెల్ల ఆ బాలిక వన్నెవన్నెల వస్త్రాలు, ఆ వస్త్రాలకు తగిన ఆభరణాలు ధరించేది. ఏడువారాలవికావు, ఏడేడువారాల వేషాలూ వేసుకొనేది. ఒకనా డామె ఉషోబాల, ఒకదినాన ఆమె జనకుని ఇంట శైశవ క్రీడల దేలు సీతమ్మ, ఇంకొకనా డామె లేతవెన్నెల కిరణము. మరిఒక్క దినం ఆమె దివ్యంగా జ్వలించే ఉడుబాల.

ఆ ఆటలలో, ఆ ఆనందాలలో వా రిరువురూ పెద్దవారై నారు. ముమ్మక్కకు వయస్సువచ్చి అంతఃపురాంగన అయినది. వసంతోత్సవములలో, పండుగ దినాలయందు, మహారాజజన్మదినోత్సవములలో తక్క, ఇతర సమయాల నామె రుద్ర ప్రభువుకంట పడకూడదు.