పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

గోన గన్నా రెడ్డి

శివ : ప్రభూ! ఈ భూమిలో ధర్మం కొనసాగడానికే ఈ విధానం అవలంబించాము. మీరు బాలికలని చెప్పగల శుభముహూర్తం వస్తుంది. ప్రపంచంలో ఆర్యభూములలో ఇదివరకు సంభవించని ఒక దివ్యఘటన ఇప్పుడు సంభవిస్తుంది గాక! మీరు అఖండ ఆంధ్ర సామ్రాజ్య సింహాసనం అధిష్ఠించాలని మిమ్ము బాలకునిగా పెంచాము తల్లీ! వీరపురుషోచితమైన విద్యలన్నీ మీకు నేర్పినారు. మీరు ఉత్తమోత్తమ చక్రవర్తులు కాగలరు. ఇదీ రహస్యం.

రుద్రదేవి తలవాల్చికొని ‘నన్ను క్షమించండి బాబయ్యగారూ, నన్ను ఆశీర్వదించండి గురుదేవా! అమ్మగారూ! మీసహజోదారహృదయంతో నన్ను మీ హృదయంలోకి తీసుకోండి. మీరు నా కర్పించిన ఈ దివ్యధర్మాన్ని నా ప్రాణాలతో కాపాడుకొంటాను’ అన్నది.

• • • • •

ఆ సంఘటన అంతా ఈ రోజున అద్దంలో తన ప్రతిబింబం చూచుకొనే రుద్రదేవికి జ్ఞప్తికి వచ్చినది. తాను స్త్రీయని లోకము తెలుసుకొనవలసిన సమయ మేతెంచినదా?

స్త్రీకి రాజ్యార్హత ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ధర్మం ఒప్పనిదే లోకం ఒప్పదు. శ్రుతి మొదటిప్రమాణ మన్నారు. శ్రుతికి వ్యాఖ్యానం స్మృతి కాబట్టి శ్రుతికన్న ఎక్కువ ప్రమాణం స్మృతి అన్నారు. లోకాచారం శ్రుతినిబంధననాచరణలో పెట్టడమే కాబట్టి, లోకాచారము పరమప్రమాణ మన్నారు. ఒక ఉత్తమపురుషుడు ప్రారంభించిన పనిని తక్కిన సర్వలోకమూ నెమ్మదిగా ఆచరిస్తుంది. అదే ఆచారము. ఆంధ్రాచారమైన మేనరికం అలాంటిదేకద!

తాను చక్రవర్తి అవును. అయిన తనకు భర్తకావలెనా? ధర్మము స్త్రీని వివాహము చేసికొనితీరవలె నంటున్నది. భర్త పోయినచో సన్యాసినిగా ఉండవచ్చును గాక!

అప్పు డామెకు పందొమ్మిదవఏట తనకు జరిగిన వివాహ విషయము జ్ఞాపకమునకు వచ్చినది. ఆమె వదనమంతట చిరునవ్వులు ప్రసరించినవి. ఆమె అధరాంచలాల అమృతప్రస్రవణాలు మిలమిలలాడి ఉబికిపోయినవి.

ముమ్మడమ్మ కమ్మనాటి నాయకుడైన జాయపమహారాజు కుమార్తె. శ్రీగణపతిరుద్రదేవునకు జాయపసేనాని బావమరిది. ఆయన కుమార్తె ముమ్మక్కదేవి అందాలరాణి. ఆ బాలిక మేనత్తలైన శ్రీగణపతి చక్రవర్తి రెండవ, మూడవ మహారాణులైన నారాంబా, పేరాంబా దేవులకడనే పెరుగుచుండెను. ఆమె కుమార రుద్రప్రభువుకన్న రెండేండ్లుమాత్రమే చిన్నది. ఆ బాలిక గానసరస్వతి, నృత్యవిశారద, విద్యాభారతి, సౌందర్యలహరి. ఆమె ఇంతబాలిక యైనప్పటినుండి యువరాజైన రుద్రదేవుని ప్రేమించినది.