పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

గోన గన్నా రెడ్డి

మిలలాడే రాజనాలు తెచ్చి ప్రభువునకు ప్రజలు ప్రాభృతము సమర్పించుకొనేవారు.

భూమి ప్రజలది. ఆ భూమిని సంరక్షించినందుకు ప్రభువు ఆరవభాగం పన్ను తీసుకుంటాడు. ఆ పన్నైనా ప్రజలకోసమే ఖర్చు. ఆ దినాలలో వ్యవసాయం అనేకరీతులుగా చేసేవారు.

ఇంక ప్రభువుకు వచ్చే రాబడి సుంకాలు, అడవులు, గనులు, స్వంత భూములు మాత్రమే!

వ్యవసాయం ఏ వరపువచ్చి పంట పండకపోయినా, ఆ పంటసగం పండినా వ్యవసాయదారులు పన్ను ఈయనవసరంలేదు. (పన్నుకోసం ఈనాటివలె మక్తాలు, జాగీరులు మొదలైనవి లేవు)

ఈ విషయాలన్నీ గమనిస్తూ రుద్రదేవులు ప్రసాదాదిత్యులను, చాళుక్య ప్రభువును ప్రశ్న లడుగుతూ అనుమానాలు అంతరింపచేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు.

3

రుద్రదేవి ఓరుగల్లు చేరింది. నగరం కోటగుమ్మందాటి, వీధులవెంట ప్రజలు జయజయధ్వానాలు చేస్తూఉండగా, గుఱ్ఱం అధివసించి చుట్టూ వీరనాయకులు పరివేష్ఠించిఉండగా విజయంచేస్తున్నది.

ఇంతలో రాచనగరుల కోటగుమ్మంముందర నూరుమంది బాలబాలికలు పూవల తట్టలతో పాటలు పాడుతూ ఎదురై నారు, వారి వెనుకనే వారి గురువులు నిలిచిఉన్నారు.

“మా ప్రభువులు మారాజు మహవీరుడయ్య
 అరివీరులకు ఆజి అపరరుద్రు డు
 శౌర్యాన అర్జునుడు ధైర్యాన నంది
 వీర్యాన భైరవుడు వితరణ దధీచి
 జయజయా జయజయా జయరుద్రదేవ
 జయ కాకతీవంశజలరాశిచంద్ర

అని పాడి రుద్రదేవిపై పూవులు చల్లినారు. రుద్రదేవి అశ్వము చెంగున దిగి ఆ బిడ్డలలో నిరువురను దగ్గరకు తీసుకొని హృదయాన కదిమికొని “ఈ బిడ్డల నందరినీ మా నగరుకు తీసుకురండి అయ్యవారూ” అని చెప్పి వారిని వదలి గుఱ్ఱ మెక్కినది. ఆమెతోపాటు గుఱ్ఱాలు దిగిన వీరనాయకులందరూ మరల గుఱ్ఱాల నధివసించి, రుద్రదేవివెంట చనినారు. రాచకార్యానికై పురుషుడైన యా బాల తన యువరాజు నగరగోపురద్వారంకడ చాళుక్య వీరభద్రుని, ప్రసాదాదిత్య నాయకుని వీడ్కొని అంగరక్షకులతో లోనికి వెడలిపోయెను.