పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

గోన గన్నా రెడ్డి

పోతుంది అంటారు శివదేవయ్య దేశికులవారు. బలమైన రాజు లేకపోతే సామంతులు పాలు విరిగినట్లు మహారాజ్యంనుంచి విడిపోతారట. ఎవరికివారే స్వతంత్రులు అవుతారు. ఏకత్వంలేని చిన్నరాజ్యాలు వేనకువేలు ఈ భరతఖండం అంతా నిండి ఉంటే, వారిలో వారికి సర్వకాలాలా యుద్ధాలు మండిపోతాయి. యుద్ధాలవల్ల ధర్మం నాశనం అవుతుంది. అటు సింహాద్రినుండి ఇటు కంచివరకు, తూర్పుతీరంనుండి కళ్యాణకటకంవరకూ తన తండ్రిగారి దివ్యచ్ఛత్రంక్రింద వికసించిఉన్న ఈ మహాంధ్రభూమి క్రిందపడిన మృణ్మయపాత్రలా కోటిశకలాలు కావలసిందేనా?

రుద్రదేవి ఆలోచన చాళుక్య వీరభద్రుడు గమనించాడు. ఈ బాలిక, ఈ వీరయోషారత్నము తండ్రితో సమంగా రెండుమూడు యుద్ధాలలో పాల్గొన్నది. ఎంతోకాలం ఈమె బాలుడనే తా ననుకున్నాడు. ఎందుచేతనో ప్రథమంనుండీ ఈ బాలుడు తన హృదయం చూఱగొన్నాడు అని తా నా దినాలలో అనుకొనేవాడు.

తన కామె స్త్రీ అని తెలిసినట్లు, నన్ను వీరంతా ఆమెపతిగా నిర్ణయించి నట్లు ఈ మహాభాగురాలికి తెలియదు! ఇదంతా రాజధర్మమా? చిన్నతనంలో ఈమె బాలుడనుకొన్నదినాలలో తనకు కలిగిన స్నేహవిరహవేదన నిజమైన ప్రేమవిరహ వేదన కాబోలు! యువకుని జ్ఞానం నిజం గ్రహించలేకపోయినా, హృదయం గ్రహించగలిగింది!

ఆమె చక్రవర్తి, తాను సాధారణ సామంతుడు. త న్నేల ఆమె ప్రేమించ వలెను? బాలికయైనా ఆమె పరిపాలనాజ్ఞానమూ, దక్షతా వర్ణనాతీతము! బాలికయై కూడా బాలునివేషంలో ఎంత అందంగా ఉన్నది. ఈమెలో సత్యభామాదేవి అందాలన్నీ కూడుకొన్నాయి. ఈమెలో లలితాదేవి మహస్సౌందర్యము మూర్తీభవించింది. ఆదిశంకరభారతీతీర్థస్వాములవారు రచించిన సౌందర్యలహరే ఈమెగా మూర్తీభవించింది. పురుషవేషంలో ఉన్న ఈ మహాదేవి తన నడకలో, తన ఠీవిలో, తన మాటలలో, తన అశ్వారోహణ నై పుణ్యంలో ఈషణ్మాత్రం ఇటు బాలికాత్వానికిగాని అటు పురుషత్వానికిగాని అపశ్రుతి కలిగించటంలేదు.

ఇద్దరూ ఈలా వేరువేరు ఆలోచనలతో గుఱ్ఱాలను నడుపుకొంటూ వస్తున్నారు.

ఈయన తన్ను బాలికఅని గ్రహించాడా అనుకున్నది ఆమె. స్త్రీ అని గ్రహిస్తే తనకు ఎప్పుడూ లేనిభయమూ, సిగ్గూ వస్తుందేమో! ఈయన అంటే తన కింత ప్రీతి ఏమి?

ఇంతలో యువరాజు అంగరక్షకులు తంత్రాపాల మల్లి నాయకుడు, విరియాల ముమ్మడిరాజు అక్కడకు అశ్వాలపై స్వారిఅవుతూ వచ్చారు. భటులు, వేట