పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

గోన గన్నా రెడ్డి

వేట నిర్విఘ్నంగా జరుగుతున్నవి. క్రూరమృగాలను వేటకాండ్లు రెచ్చగొట్టడం, రుద్రదేవి, చాళుక్యవీరభద్రుడు, మహాదేవప్రభువు, విరియాల మల్లాంబిక బాణాలు ధనస్సుల సంధించి చెవులకంట అల్లెత్రాళ్లులాగి, సువ్వున అ క్రూర మృగాల గుండెల్లోంచి దూసిపోవేయడం, పెద్దపులులు, చిరుతలు, ఎలుగులు, అడవిపందులు, సివంగులు, అడవిపిల్లులు కుప్పకూలడం జరుగుతున్నది.

ఏ కారణముచేతనో చాళుక్యవీరభద్రుడూ, రుద్రమదేవీ తమతమ గుఱ్ఱాల మీద స్వారి అవుతూ అడవిలో ఒకభాగంలో తారసిల్లారు.

వీరభద్రుడు : ప్రభూ! మీ గురి అర్జునునికి పాఠాలు నేర్పుతున్నది.

రుద్రదేవి : మీరు నిన్న సాయంకాలము పడవేసిన బెబ్బులి రెండు కళ్ళ మధ్యను జ్ఞాననేత్రం తెరువబడలేదా మహారాజా? ఆ బెబ్బులి నన్ను పగబట్టినట్లు నామీదకు ఉరకటం, మీ రా సమయంలో దగ్గిరలో ఉండటం .....

వీర : అలా అంటారేమి మహాప్రభూ ! మీరు ఏదో యాదాలాపంగా ఉన్న సమయంలో అది మీపైన ఉరికింది. అక్కడ నేను ఉన్నానుగనుక మా ప్రభువు సహాయానికి నేను వచ్చాను.

రుద్ర : మీరు మొదటిబాణం వేయగానే, నా గుఱ్ఱంపై ఉరకబోయిన ఆ పెద్దపులి మీవైపు తిరిగింది. వెంటనే మీ రెండోబాణం దాని మెదడులో నుండి దూసుకుపోయింది! మీ ఉపకృతికి నే నేమి మారు ఈయగలను?

వీర : మహాప్రభూ! మీ స్నేహంకన్న, మీ ఆదరణకన్న నాకు కావలిసినది ఏమున్నది ?

పురుషవేషంతో ఉన్న రుద్రదేవి బాలునిలా ఉన్నది. మీసాలురాని పదియారేళ్ళ కుమారునిలా ఉన్నది. ఆమెతలపై శిరస్త్రాణం ఉంది. వెనుకవున్న ఎత్తైన కేశాలను గట్టిగా ముడివేసినప్పటికీ ధమ్మిల్లము అతిపెద్దదిగా ఉండడంవల్ల అందుపై సన్నని వుక్కుగొలుసుల అల్లికవస్త్రములు వ్రేలాడుచున్నవి.

వుత్తుంగాలైన ఆమె సౌవర్ణవక్షోజాలను అదిమి స్తనవల్కలము ధరించి, అందుపై పట్టుతో రచింపబడిన పురుషకంచుకము ధరించి, ఆ కంచుకముపై ఆమె ఉక్కుకవచం ధరించినది. మెళ్ళో పురుషహారములు ధరించింది.

స్త్రీలకు, పురుషులకు ఒకేవిధములైన ఆభరణాలు ఉంటవి. తేడా పనితనంలో మాత్రం ఉంది.

రుద్రదేవి పురుషాభరణాలు ధరిస్తుంది. ఆమె అధివసించిన అజానేయము ఉత్తమ అరబీగుఱ్ఱము. ఈ జాతిగుఱ్ఱాలు భరుకచ్ఛం వస్తాయి. అక్కడనుంచి మెరకదారిని ఓరుగల్లు మహాపురము వస్తాయి.