పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయగాథ

రుద్రదేవి

1

ఓరుగల్లుకు ముప్పదిగవ్యూతుల దూరంలో గోదావరీతీరారణ్యా లున్నవి. గోదావరితీరానివి గంభీరమైన అడవులు. కృష్ణాతీరానివి అందమైన అడవులు. హిమాలయపర్వతారణ్యాలు దివ్యమైనవి. మలయద్వీపారణ్యాలు భయంకరారణ్యాలు.

ఈ అరణ్యాలలో వెలుగెరుగని నేలలున్నాయి. నల్ల, ఎఱ్ఱ, రాతి మొదలైన ఏవిధమైన నేలా కనబడని గడ్డిజాతులు, ముళ్ళజాతులు, లక్షలకొలది తీగెల జాతులు, ఓషధులజాతులు, నేలమట్టం మొక్కలు, చిన్నజొంపాలు, నిలువెత్తు గుబురులు, నిలువున్నర ఎత్తు ముసుర్లు, ఆకాశంఎత్తుచెట్లు, అడుగుమందాలతీగలు, చేయిమంద తీగలు, సాలితంతుల తీగెలు అనేకజాతులవి. అనేకజాతులవృక్షాలు, కరక్కాయ, ఉసిరిక, జీడి, తాళిక, తంగేళ్ళు, మద్దులు, రేలలు, టేకుపాలలు, మామిళ్ళు, తాడులు, ఇప్పలు, చండ్రలు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయేవి, అన్నిదెసలూ ఆక్రమించేవి, ఆకులముళ్ళు, కాయలముళ్ళు, పూవులముళ్ళు, కొమ్మలముళ్ళుకలవి, మంచివాసనకొట్టేవి, కారపువాసనకొట్టేవి, చేదువాసన, మత్తు వాసన, దుర్గంధము కొట్టేవి, రంగురంగుల పూవులవి, చిన్నపూవులవి, పెద్దపూవులవి, అడివిమల్లె, అడివిపారుజాతం, శేఫాలిక, అందాలఆకులు, రంగురంగుల ఆకులు, అనేకరూపాల ఆకులు, పొడుగువి, పొట్టివి, నీటిదగ్గర పెరిగేవి, రాళ్ళ రాళ్ళమధ్య పెరిగేవి. ఈలాంటి మహారణ్యంలోకి శ్రీరుద్రదేవి యువరాజులవారు, శ్రీ చాళుక్య వీరభద్రమహారాజు, పురుషవేషంతో ఉన్న చెలులు, శ్రీ శ్రీ చాళుక్య మహాదేవరాజు, శ్రీ సత్రము బొల్లమరాజుమంత్రి, శ్రీ తంత్రపాలు మల్లి నాయకుడు, రాజబంధువు శ్రీ విరియాల ముమ్మడిరాజు అనేక సైన్యాధిపులతో, వీరులతో, వేటవిద్దెపాటవం కల బోయిలతో, అడవిచెంచులతో, కోయదొరలతో వేటకు వేంచేసి ఉన్నారు.

యువరాజు శ్రీ రుద్రదేవులు వేటకు వస్తున్నారంటే, వారికి వేటకు వెళ్ళే రాజపథంలోఉండే మండలేశ్వరులకు, విషయోద్యోగులకు, దశగ్రామాధిపులకు, గ్రామాధిపులకు, రైతులకు, కులకరుణులకు రాజాజ్ఞలు వెళ్ళినవి. దారిలో సర్వ సౌకర్యాలు కలిగించవలసిందని, అందుకు కావలసినధనం చక్రవర్తుల కోశాగారమునుండి అందజేయబడింది. ఓరుగల్లు మహానగరాన్నుండి వేలకొలది ఉద్యోగులు వచ్చు దారిపొడుగునా కట్టుదిట్టాలు చేశారు.