పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేమాంభోధి

319

మేము చెప్పిన విషయాలన్నీ గ్రహించి ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాకుండా తాము స్వయంగా వచ్చి మిమ్ము ప్రార్ధిస్తారట.

గోన: మహాప్రభూ!

రుద్ర: సరే! సరే! విశాలాక్షప్రభూ! మీరు ఇక వెళ్ళవచ్చును. గన్నారెడ్డిప్రభూ! మిమ్ము మా మహారాజుగారు కలుసుకోవా లనుకుంటున్నారు.

గోన: చిత్తం మహాప్రభూ!

విశాలాక్షప్రభువు ఒకవైపునకూ, గన్నారెడ్డిప్రభువు ఒకవైపునకూ చక్రవర్తికి మ్రొక్కి వెడలిపోయినారు. గన్నారెడ్డి తిన్నగా చాళుక్యవీరభద్ర మహారాజుకడకు వెళ్ళి వారి దర్శనం చేసుకొన్నారు. వీరభద్రమహారాజు గన్నారెడ్డిని చూచి, “ప్రభూ! నన్ను మీరు అపార్థం చేసుకోకుండా ఉంటే ఒక విషయం మనవి చేస్తాను. శుభకాలంలో పవిత్రసంఘటనలు మనకు కొన్ని సంభవిస్తాయి. అవి నిష్కల్మషభావంతో, పవిత్రహృదయంతో గ్రహించాలని కోరుతున్నాను. తమకు దేశికులు స్వహస్తనామాంకితమైన ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరం స్వయంగా తమకీయాలని నేను తమవిడిదికి రావాలని సంకల్పించుకొని ఉండగా, తామే చక్రవర్తిగారి విడిదికి వచ్చారని తెలిసి తమ్ము కలుసుకోగోరి వార్తపంపాను” అని తెలిపినారు.

గన్నారెడ్డి సంతోషముతోలేచి, ఆ ఉత్తరమందుకొని కనుల కద్దుకొని మహారాజువారివద్ద సెలవుతీసుకొని, తన విడిదికి చేరినాడు. అక్కడ పేటిక తెరచి, కమ్మతీయగా అందులో “శ్రీ శ్రీ గన్నారెడ్డి మహారాజులను ఆశీర్వదించి -

“ప్రభూ, మీరు ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది మహోత్తమజాతిపురుషులలో ఒకరు. మీకై చిరంజీవి సౌభాగ్యవతి అన్నాంబికా కుమారి వెలసింది! ఆమెకై మీరు వెలసినారు. ఇది పరమ శివప్రీతికరం. పార్వతిని పరమేశ్వరుడు పొందకపోవడము ఎలాంటిదో, మీరుఅన్నాంబికా కుమారిని ఉద్వాహము కాకపోవడము అలాంటిది. ప్రాపంచకమైనవేవీ మీకు అడ్డం రాకూడదు. పరమధర్మమట్టిది. మేము స్వయంగా శ్రీ చక్రవర్తితో వచ్చి మీకు వివాహము, పట్టాభిషేకము జరిపిస్తాము. మిమ్ము ఆయురారోగ్యవంతులుగా, మహారాజ్యాభిషిక్తులుగా, పుత్రపౌత్రవంతులుగా శ్రీ సోమనాథదేవ దివ్యశ్రీపాదపద్మారాధకులుగా ఆశీర్వదిస్తూ శివదేవయ్య” అని చదివినాడు.

ఏమిటి? శివదేవయ్యదేశికులు! ఈ విషయంలో ఈలా చక్రవర్తి, మహారాజులు, దేశికులు అందరూ చేయిచేసుకొన్నారేమి? అనుకొంటూ