పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

314

గోన గన్నా రెడ్డి

రాజు: అవును మహారాణీ! ప్రయత్నముచేసి చూడవలెగదా?

రాణి: ప్రభూ! ఒక్కతే మనకు బిడ్డ! సర్వవిద్యలలోనూ సరస్వతిని మించేటట్లు పెంచారు. బాలుడయినా బాలిక అయినా ఆ ఒక్కతేగద మనకు? అమ్మాయి హృదయం ఏమిటో తెలుసుకోవద్దా?

రాజు: రాచకులాలలో వివాహాలంటే రాజనీతికి సంబంధించి ఉంటాయి. అక్కడ మన యిష్టము అయిష్టము ఎలా పనికివస్తుంది దేవీ!

రాణి: ఈలాంటి రాజనీతి పాటించే, వరదారెడ్డికిచ్చి చేయాలని పట్టు పట్టారు. అంతా వ్యతిరేకమయిపోయింది.

రాజు: మహారాణీ! ఏమిటి నీ ఆలోచన?

రాణి: ఆలోచనేకాదు, నా దృఢనిశ్చయంకూడా, అమ్మాయి ఉద్దేశం తెలుసుకొనడం మంచిదని!

ఆ మరునాడు మహారాణి కొమరితదగ్గర కేగెను. అన్నాంబిక ఎంత కాలమో విషజ్వరపీడితఅయి అప్పుడే విముక్త అయిన బాలికలా చిక్కిపోయి, ఉత్సాహరహితయై ఉన్నది. ఆమె పెద్దకళ్ళు ఇంకా పెద్దవాయెను. ఆమె నునుచెంపలు కాంతి కల్గిన బంగారు ఫలకాలులా ఊరుకున్నాయి. ఏదో నిస్పృహ! ఎప్పుడూ నిట్టూర్పు!

రాణి: తల్లీ! ఏమి అలా ఉన్నావు. వంట్లో బాగుండలేదా?

అన్నా: ఏమీ జబ్బులేదు. ఏదో దేశం మారడంచేత కాస్త నలతగా ఉంది, అంతే!

రాణి: మల్లికా, ఏమిటి అమ్మాయిగారివంట్లో? రాజవైద్యులు వచ్చి చూచారా? దాదిని పిలు.

మసలిదాది తిప్పక్క త్వరత్వరగా మహారాణికడకు వచ్చింది.

తిప్పక్క: అమ్మాయిగారికి దృష్టులు తీసివేశానండి. కులదేవతకు బలులు ఇప్పించానండి. సోది అడుగించానండి. వైద్యులచేత పరీక్ష చేయించానండి.

ఇంతట్లో అతి తొందరగా ద్వారపాలిక ఒక దాసీని వెంటబెట్టుకొని లోపలికి వచ్చి “మహారాణీ జయము! మహారాజులంవారు ఈ దాసిని తమ కడకు ఒక ముఖ్యవార్తతో పంపినారు” అని మనవి చేసెను.

రాణి: ఏమి టా వార్త?

దాసి: మహారాణీ జయము జయము! మహరాణీవారికడకు శ్రీ చక్రవర్తి కడనుండి ఒక సేనాపతి తమ దళముతో విచ్చేసినారండి. శ్రీ చక్రవర్తిగారూ, వారి భర్త శ్రీ చాళుక్య వీరభద్రమహరాజులంవారూ వారం దినాలలో సంగమేశ్వరం దర్శించుకొని, అక్కడనుండి ఇక్కడకువిచ్చేస్తారట అని వార్త తెచ్చినారు! మహారాజులంవారు ఈవారం దినాలలో అంతఃపురసిద్ధం చేయించవలసిందని కోరుతూ మహారాణిగారికి చెప్పవలసిందని నన్ను పంపించారండి.