పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏదిదారి

313

వెండి బంగారాల కలయికలు! ప్రేమమూర్తులయిన భార్యాభర్తల కలయిక మేలిమి బంగారము మేలిమి బంగారము కలిసిపోయినట్లే!

ప్రేమించిన పురుషుడు ఉన్నాడనుటే ఆనందము. అతడు కనిపించిన నాడు మహదానందము. ప్రేమించిన పురుషుడు భర్తయగుట బ్రహ్మానందము. ఇంక ఆ భర్త భార్యను ప్రేమించుట బ్రహ్మానందాతీతమైన పరమేశ్వరత్వమే.

ఈ మహాపురుషుడు తన్ను ప్రేమిస్తున్నాడా! ప్రేమించకపోయిన పోనీ! తాను వైరాగ్యంతో ఆయన నామమే జపం చేసుకొనుచు కాలము గడుపగలదు.

తమ కుమారిత హృదయం కోటారెడ్డి మహారాజుకుగాని, మహారాణికి గాని ఏమి అర్థమవుతుంది!

ఇంక వరదారెడ్డికి ఆమెనిచ్చి వివాహం చేయడు. అయితే ఇక ఎవరి కిచ్చుట? బిడ్డ అందముచూస్తే దృష్టి తగులుతుందని తన మహారాణే పలుమారులు అంటుంది. అసదృశమైన తన కొమరిత అందానికి తగిన వరు డెవ్వరు?

కోటారెడ్డి ఆలోచనకు గోనగన్నారెడ్డి స్ఫురించనేలేదు. గన్నారెడ్డి విచిత్ర పురుషుడు. అతడు ఇంకను గజదొంగగానే కోటారెడ్డి మనోనయనాలకు కన్పించు చున్నాడు. ఆయన రుద్రదేవికి కుడిచేయిగా ఉన్నాడని రుద్రదేవి నిండుసభలో అనవచ్చుగాక! అబల అయిన ఆడది కాబట్టి అతడు చేసిన పనులు ఆమెకు ఉపకారాలయ్యాయి కాబట్టి ఆతన్ని పొగడింది. అతడు తాను దొంగతనంచేసి నాశనం చేసినవారు చక్రవర్తికి విరోధులయితే మరీ మంచిదని ఆలోచించాడు. అంతకన్న అతని గొప్పలేదు. ఏదో తన అక్కగారిని తీసుకొనివచ్చి, నగరినుండి పారిపోయిన మా అమ్మాయిని అప్పగించాడు. అది కొంత నయం! ఇంతకు తనకూతు రలా కోటనుండి పారిపోయేటట్లు చేయించడం ఎంత తలవంపుపని!

ఏదో, తన బిడ్డను ఎవరో ఉత్తముని కొకనికి ఇచ్చి.....

ఇంతలో పరిజనపరివేష్టితయై మహారాణి మహారాజు అభ్యంతరమందిరాలకు వేంచేసినది. మహారాజు లేచి, ఎదుర్కొని తీసుకొనివచ్చి ఒక పీఠికపై తన ప్రక్కనే కూర్చుండ బెట్టుకున్నారు.

రాజు: దేవీ! ఈలాగు దయచేశారు?

రాణి: మహాప్రభూ! అమ్మాయి వివాహం మాట ఏంచేశారు?

రాజు: నేను అదే ఆలోచిస్తున్నాను దేవీ! వందిభూపాలుని తనయుడు కందవోలు మహారాజు ఒకడు నాకు కనబడుతున్నాడు.

రాణీ: తన గురువైన గోన గన్నారెడ్డి మహారాజు వివాహం చేసుకుంటేగాని వివాహంచేసుకోననికదా ఆయన పంతంపట్టినట్టు మనమువింటిమి!