పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుట్ర

25

ఇప్పుడే ఓరుగల్లుపై యుద్ధానికి రావడం వీలుపడదు. మీరంతా సంపూర్ణంగా సిద్ధం కండి. మేము ఎప్పటివార్త అప్పటికి అందజేస్తూంటాము.

రుద్రమంత్రి : ఇంత సులభంగా మా రాయబారం పూర్తికాగల దనుకో లేదు. మా కీ దినము ఆనందదినము.

భవానీభట్టు : రుద్రయమంత్రులవారూ! మేము ఏ దారిని వస్తామో ఆ దారిలో మీ సైన్యం కొంత మాకు కలవాలి. మేము ఓరుగల్లును ముట్టడించగానే మీరు మీ తక్కిన సైన్యాలతో వచ్చి మా సైన్యంలో చేరిపోవాలి.

రుద్ర : అలాగే చేస్తాము. ప్రభువులు నాకు రేపు బయలుదేరటానికి సెలవిప్పించాలి.

రుద్రయ్యమంత్రి అతిజాగ్రత్తగా శౌణదేశచారుల సహాయంతో స్వదేశం వస్తూ ఉండెను. గోదావరినిదాటి రెండుదినాలు ప్రయాణంచేసి వచ్చినాడు. రాత్రులే ప్రయాణం. పగలు ఏదో గ్రామంలో ఆగిపోతూ ఉండెను. రుద్రయ్యమంత్రి కాశీ ప్రయాణంచేసి వచ్చే ఉద్యోగివలె వేషము వేసుకొని ఉన్నాడు.

ఒకనాడు బొలినవాడ అనే గ్రామంలో విడిదిచేసి ఉన్నప్పుడు పగలు ఎవరో ఆయింటిని చుట్టుముట్టివేసినారు. “ఏడయ్యా దొంగరుద్రయ్య, రాజద్రోహి రుద్రయ్య, పాపి రుద్రయ్య!” అంటూ ఆ బ్రాహ్మణుని ఇంటిలోకి విచ్చుకత్తులు, భల్లాలు ఝళిపిస్తూ బిలబిలమంటూ విచ్చుకత్తులవారు వచ్చిపడ్డారు.

“పాపం! ఈ రుద్రయ్యమంత్రి మహానుభావుడు. దేవగిరి కాశీనుంచి వర్ధమానపురం రామేశ్వరానికి పోతూఉన్నాడు. ఆహాహా! శ్రీ శ్రీ గోన బుద్ధారెడ్డి ప్రభువుదగ్గర అత్యంత నమ్మకంతో పనిచేసిన మాధవమంత్రి కొమారులు రుద్రయ్యమంత్రులు ఆంధ్రరాజ్యాన్ని తరింపజేయడానికి అపర మహేశుడు యాదవ మహాదేవుణ్ణి తీసుకువస్తాడట!” అంటూ గజదొంగ గన్నారెడ్డి గదిలోపలికి చక్కావచ్చాడు.

గన్నారెడ్డిని చూడగానే రుద్రయ్యమంత్రి అయిదుప్రాణాలు వేసంకాలంలో నీరు ఆవిరిఅయినట్లు అయిపోయాయి.

అయినా, లేనిధైర్యం తెచ్చిపెట్టుకొని, రుద్రయ్యమంత్రి గన్నారెడ్డిని చుఱ చుఱ చూచాడు. “ఏమి ! నువ్వెవరవు? బుద్ధిలేదా? శ్రీ శ్రీ అపర మహేశ్వరులు గణపతిరుద్రదేవ ప్రభువు రాజ్యంచేసేదేశం కాదనుకున్నావా?” అని రుద్రయ్య మంత్రి మండిపడ్డాడు.

గన్నారెడ్డి ఫక్కున నవ్వి ‘అబ్బే ! ఆడది రాజ్యంచేస్తూంది అనుకున్నా! అవును, మరి అలా ఆడది రాజ్యంచేయకుండానే మనం అందరమూ ప్రయత్నం చేస్తున్నాముకాదా రుద్రమంత్రీ!’ అన్నాడు.