పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

310

గోన గన్నా రెడ్డి

అక్కి: ఈ గంధర్వాశ్వం ఎక్కి ఏ గంధర్వలోకమో వెడదామని మా బావగారి ఉద్దేశం!

గన్నా: ఎందుకు బావా గంధర్వలోకం? ఇక్కడి నిర్వాహము చాలకనా?

అక్కి: ఏం? చంద్రాపీడునివలె ఏ కాదంబరినో దర్శింపవచ్చునుగా?

గన్నా: తాము పుండరీకులు కాబోలు. అయితే నీకు విరహ వేదన లేదు కాబట్టి బ్రతికిపోయినావు!

అక్కి: అమ్మయ్యా దొరికినాడయ్యా దొంగ! కాదంబరి కోసమా విరహం?

గన్నా: కాబోయే మామగారితో, చంద్రాపీడునికి విరోధము!

అక్కి: విరోధమేమి? ఒక వేళ ఆ గంధర్వరాజు హృదయంలో వెనకటి ఆలోచనలన్నీ ఉన్నాయే అనుకొందాము. కాని రెక్కలు తెగినపక్షిలా ఉన్న ఆ గంధర్వపతి ఏమి చేయగలడు?

గన్నా: అదేనయ్యా చంద్రాపీడుని ఆవేదనకు కారణం. మహాకవివి, ఆమాత్రం గ్రహించలేవా?

అక్కి: ఓహో! ఆ చంద్రాపీడు డెంత నిర్దయుడు! ఆవల మహాపతి వ్రత అయిన కాదంబరి జీవితమంతా వ్యధలపాలయి, చివరకు ప్రాణాలు కోలు పోవలసిందేకాబోలు!

గన్నా: హృదయధర్మ మలాంటిది బావా!

అక్కి: యువతీ యువకుల ప్రేమధర్మముకంటే ఇతర ధర్మాలు ఎక్కువనా బావగారూ!

గన్నా: మానమర్యాదలేకాదు బావగారూ! ఒక్కొక్కనిహృదయం అలాంటిది. రాచపౌరుషము అలాంటిది. రాజ్యగౌరవము, మర్యాద, దివ్యమైన ప్రేమను ముళ్ళకంచెలులా చుట్టి ఉంటాయి.

అక్కి: ప్రభూ! ఆదవోని ప్రభువును, విఠలధరణీశ మహారాజు యాదవుని కలవాలని వెళ్ళుతూన్నప్పుడు ఓడించారు, వదలినారు. శ్రీ అన్నాంబికాదేవికి ఆయన తండ్రి అగుటే అందుకు కారణం.

గన్నా: నా హృదయం, నా ఆత్మ సంపూర్ణంగా ఎరిగిఉన్న బావగారికి తెలియదా?

అక్కి: బావగారూ! అయితే రాజ్యలక్ష్మిని జయించి చేబట్టినట్లు శ్రీ అన్నాంబికాదేవిని చేపట్టండి!

గన్నా: బావగారూ! ఎంతవెఱ్ఱివాడవయ్యా! నే నెరుగని యువతి అయితే శత్రువును జయించి, బాలికను చేబట్టి ఉందును కాని నా జీవితంకన్న, నాఆత్మ ఎక్కువకాదా?