పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్యాభిషేకము

307

అప్పుడు దేవి నవవధువులా సిగ్గుపడుతూ అక్కడ ఉన్న ఆంధ్రవీణ శ్రుతిచూచి, వేగవాహినీరాగానికి మెట్టు సవరించి, “సరిగ పధప” అని ఆరోహణమూ, “పధప గరిస” అని అవరోహణమూ అయిన మధుర మోహనరాగాన్ని ఆలాపించినది. వేగవాహిత మిశ్రరాగము.

ఆ రాగము హిమాలయాలలో ప్రవహించే మందాకిని.

నవయౌవన హృదయంలోని ఆవేగము ఏలాంటిదో వేగవాహినీరాగ మట్టిది. జౌడవ షాడవ రాగజన్య మవడంచేత దేవతలకు; మనుష్యులకు ఉద్భవించిన విద్యాధరివంటి దా రాగము.

మంచు కరగినది; అతిశీతలాలైన ఆ నిర్మలప్రవాహ నీరాలు జలజల ప్రవహించాయి. రాళ్ళపై విరిగినాయి; సుళ్ళుతిరిగినాయి, అతివేగంగా పారిజాత కుసుమపరిమళ పూరితమైన ఆ ఎత్తైన దేవభూమి లోయలలో పతనాలతో ప్రవహించాయి. వేగవాహినీ రాగస్వరా లా నీరాలు!

చాళుక్య వీరభద్రు డా రాగసౌందర్యంలో కరగిపోయి, ఆ దేవి రూపసౌందర్యంలో లయమౌతాడు.

సిగ్గుపడుతూ చిన్న బాలికలా రుద్రదేవి దీర్ఘ పక్షాల నెత్తి, ఒకలిప్త మాత్రం చాళుక్య వీరభద్రుణ్ణీ గమనిస్తుంది. ఆమెను చూచి ఆతడు, ఆతని చూచి ఆమె సిగ్గుపడతారు. కన్నులు నిమీలితాలు చేసుకుంటారు.

ఆమె తన తీయని కంఠమెత్తి ఆ వీణకు మేళవించి, అన్నాంబిక రచించి తనకు నేర్పిన పాటను వేగవాహినీ రాగంలో పాడింది.

“ఎవరున్నారు, ఈ నీలకాదంబినీమాలలో ఎవరున్నారు చంచలా!

 తళుకుమనిపోయావు దశదిశలు వెలిగించి
 బిలుకుమని కనులు మూతలుపడెను చంచలా
ఎవరున్నారు?

 గంభీరమై ఏవొ గళమాధురులు గురిసె
 గరళకంఠుని దివ్య గాంధర్వమా ఏమి?”

4

విజయదశమికి శ్రీగోన గన్నారెడ్డి పట్టాభిషేకమహోత్సవం వర్థమానపురంలో జరుగవలసిఉన్నది. గన్నారెడ్డిని ఎంతమంది వేడినా అవుననీ కాదని తెలుపడు.

చిన అక్కినప్రగడ ఎన్నిసారులు మనవిచేసినా గన్నయ్య నవ్వుతాడు. శుభముహూర్తంలో శ్రీ రుద్రదేవికీ శ్రీ చాళుక్య వీరభద్ర మహారాజుకు,