పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్యాభిషేకము

303

సభఎల్ల వెంటనే నిలుచుండెను. గురుదేవు లొక్కరే కూర్చుండి యుండిరి.

చక్రవర్తి తన మెడలోని హారం తీసి, మందయానంతో, సిగ్గు తో మోము ఎఱ్ఱవార, చాళుక్య వీరభద్రునికడకు వెళ్ళి, కొంచెమువణికే కంఠంతో ‘మహారాజా! కాకతీయ సామ్రాజ్యంతో ఈ దాసురాలిని స్వీకరించ ప్రార్థన!’ అని తల వంచుకొన్నది. ‘మా ముమ్మక్క మహారాణి చాళుక్య మహాదేవ మహారాజును వరించుచున్నది’ అనెను.

2

లకుమయారెడ్డి తానుచేసిన తప్పులన్నీ ఒప్పుకొని, చక్రవర్తి క్షమాపణ అడిగి కుమారుడైన వరదారెడ్డిని వారి పాదాలకు అప్పగించినాడు. గన్నారెడ్డిని దర్శించి, ‘ప్రభూ! నేను మీ పినతండ్రిని కావడానికి తగనివాణ్ణి. అన్నగారి ఆజ్ఞ నిలబెట్టలేని మూర్ఖుణ్ణి. ఎట్టి శిక్ష కైనా తగినవాణ్ణి’ అని మనవిచేసెను.

గోన గన్నారెడ్డి: బాబయ్యగారూ! స్త్రీలు, రాజ్యాలు మనుష్యుల మనస్సులను పాడుచేస్తవి. విధిదుర్విపాకం అటువంటిది. మీరు ఆజ్ఞ ఇస్తే పాలిస్తాను.

లకు: తండ్రీ! పైత్యరోగికి అన్నీ పచ్చగా కనబడినట్లు, నాకా రోజుల్లో అధర్మపూరితాలయినవన్నీ ధర్మపూర్ణము లైనట్లు తోచాయి. ఈ రాజ్యం నీది. నీ ప్రతిభ అసమానం. భారతగాథల్ని మరపించేసే మీ చరిత్ర సువర్ణాక్షరాలతో శాసనాలుగా లిఖింపబడవలసినది. ఈ మహా సామ్రాజ్యాన్ని రక్షించిన అర్జునుడవు. నీ పాదాల వరవణ్ణి నే నొస్తున్నాను. నేను శ్రీ కాలాముఖమఠం చేరి తపస్సు చేసుకుంటూ ఈ చరమకాలం గడుపు తాను.

గన్నా: బాబయ్యగారూ! వరదయ్య నాకు విఠలయ్యతో సమానం. అతడే భువనగిరిని ఏలుకొంటాడు.

లకు: నాయనా! ఆదవోనివారి అమ్మాయిని నువ్వు చేసుకో! వరదయ్యకు మంచి సంబంధము చూడు. అతడు నీ బిడ్డసుమా తండ్రీ! నీ ఈడును మా అన్నగారు మూడుమూర్తులా నీ పోలికే. నీ తండ్రిని మరపించే శక్తిమంతుడవయ్యావు. ఆయన సుగుణాలన్నీ నీలో కాంతించాయి. ఇంక నేను వెడుతున్నా!

పినతండ్రి తన ప్రస్థానానికి అన్నీ సిద్ధంచేసుకొని ప్రయాణం సాగించాడు.

వరదారెడ్డి, విఠలధరణీశుడు, గన్నారెడ్డి మంత్రులతో, సేనాపతులతో కూడా ఓరుగల్లునుండి శ్రీశైలంవరకూ వారిని సాగనంపి తిరిగివచ్చారు!