పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్యాభిషేకము

301

గణపవరంనుండి తెలుగు నాయక సామంతులు, స్వామినాయకుడు మల్లాప్రెగ్గడతో వేంచేసినాడు. (తెలుగు నాయకులు తెలగాలయ్యారు) గణపతిదేవ చక్రవర్తి దేవేరులయిన నారాంబ పేరాంబల మేనల్లుడు, జాయపసేనాని అన్నకొమరుడైన చిననారపనాయకుడు (కమ్మనాటి ప్రభువు) తన దేవేరులతో, బిడ్డలతో, తమ్ములయిన చోడమహారాజుతో వేంచేసినారు. (వీరు కమ్మవారు)

వేంగి దేశాధిపతి అయిన తెలుగురెడ్డి (తెలగా) నాయకుడు గణపతి రుద్రదేవుని సేనాపతి కాలపయనాయకుని కొమరుడు కాలపనాయకుడు వేంచేసినాడు.

నిరవద్యపురంనుంచి చాళుక్యవృద్ధులు ఇందుశేఖరమహారాజు వేంచేసినాడు. ధరణికోటనుండి కోట భేతమహారాజు గణపాంబతో కలిసి వేంచేసినారు. కోనసీమ నుండి హైహయ మహారాజులు, భీమవల్లభ నృపాలుడు తన దేవి అన్నమాంబతో కలిసి వేంచేసినారు.

జన్నిగదేవుడు వృద్ధుడై తన సంపూర్ణరాజప్రతినిధిత్వము అంబయదేవ త్రిపురాంతక దేవుల కప్పగించి, తాను పట్టాభిషేకానంతరము శ్రీ శైలాన తపస్సు చేసుకొన సంకల్పించాడు. సిందవాడనుండి, మార్జవాడినుండి అంబయదేవ త్రిపురాంతక దేవులు వేంచేసినారు.

ఈలా సకల బంధువులు, సామంతులు, ఉద్యోగులు కొలుస్తూఉండగా శ్రీ శివదేవయ్యమంత్రి, శివగురువులు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, పండితులు, ఆశీర్వాదం చేస్తూఉండగా శ్రీ రుద్రదేవ ప్రభువునకు సామ్రాజ్యాభిషేకం జరిగినది.

సంతోషముతో దేశాలన్నీ పాలసముద్రమై విరుచుకుపడినాయి.

పట్టాభిషేకమహోత్సవం అయినరాత్రి తన నగరికి రుద్రచక్రవర్తి చేరి, మహాతల్పం పై మేనువాల్చింది. అలసట పడినందుకు సొమ్మసిల్లి నిద్రరాదు.

పనికత్తెలు మహాప్రభువునకు అన్నీసమకూర్చి తాము వెడలిపోయినారు.

నగరి మోసాలకొట్టే ఘటికాఘంటలు మ్రోగుతూనే ఉన్నాయి కాబోలు, అవి ఆ మహాకోలాహలంలో ఎలా వినబడతాయి?

ఊరంతా జరిగే ఉత్సవాలు జరుగుతున్నాయి. తా మా ఉత్సవ మహాసభలో పీఠం అధివసించి ఉండవలసిందే!

అయినా రెండుఘటికలు విశ్రాంతి తీసుకోవడానికి, దృష్టి మొదలయినవి తీయడానికీ లోనికి రావలసివచ్చింది. ఇప్పుడే దాసీలువచ్చి తన వస్త్రాదికాలు, ఆభరణాలు మార్చి మళ్ళీ సభకు తీసుకొనిపోతారు.

తా నొక్కతే సింహాసనం పై కూర్చుండవలసివచ్చింది.