పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

గోన గన్నా రెడ్డి

పేర్మాడిరాయకంఠాభరణచూరకార జయ! శ్రీ చోడోదయపట్టసూత్ర తురంగాపహార జయ! శ్రీ నిజకీర్తిపూరిత బ్రహ్మాండకరండ జయ! శ్రీ వరబలోద్దండ జయ! శ్రీ పరబలసాధక జయ! శ్రీ సోమనాథదేవ దివ్య శ్రీపాదపద్మారాధక జయ! శ్రీ వర్థమానపురవరేశ్వర జయ!” అని వందులు గన్నారెడ్డిని కీర్తించిరి. సభ అంతా హర్షధ్వనులతో పొంగిపోయింది.

అప్పుడే అనేకులకు గన్నారెడ్డి నిజతత్వం గోచరించింది. కొందరు ఇదేమి గజదొంగ అని ఆశ్చర్య మందినారు. కొందరు గన్నారెడ్డి నూతన సామ్రాజ్యము స్థాపిస్తాడు కాబోలు అనుకున్నవారు రిచ్చవడి చూడసాగిరి.

గన్నారెడ్డి తల కొంచెం వంచి ఏమీ కదలక నిశ్చలవదనంతో నిలిచి ఉన్నాడు. ఆయన మోమున రాజభక్తి దివ్యకాంతి ప్రసరిల్లుచున్నది.

శ్రీ రుద్రదేవి చిరునవ్వుతో గన్నారెడ్డివైపు చూచి ‘శ్రీ గన్నారెడ్డి మహారాజా! నువ్వు నాలుగేళ్ళనాడు మాకడకూ, శ్రీ గురుదేవులకడకూ వచ్చినప్పుడు ప్రతిజ్ఞలు అన్నీ నెరవేర్చలేదేమో అని అనుమానించినందుకు మీ ప్రభువును మీరు....

గన్నారెడ్డి చేతులు జోడించి మనవిచేసెను. ‘మహారాజాధిరాజా! అష్టమ చక్రవర్తీ! భక్తునిబలం భగవంతునిదే అన్నట్లు, నా చక్రవర్తికి నేను బంటును. హనుమంతుని బలం రామునిలోనుండేకదా వచ్చింది.’

ఓరుగల్లు మహానగరమూ, కాకతీయ సామ్రాజ్యమూ సామ్రాజ్ఞి పట్టాభిషేకకాలంవరకూ చేసిన ఉత్సవాలు వర్ణనాతీతం. దేశం అంతట దినదిన తోరణాలు, దినదిన పండుగలు, నాట్యాలు, భగవత్కథా కాలక్షేపాలు, నాటకాలు.

సుంకాలు అన్నీ తీసివేసినారు. అన్ని మతసంస్థలకు చక్రవర్తి, మాండలికులు, రాజోద్యోగులు దానశాసనాలతో గ్రామాలు, భూములు, దేవాలయాలు నెలకొల్పినారు. చెరువులు, కాలువలు త్రవ్వించినారు.

నగరమంతా పార్వతీదేవి కళ్యాణంనాటి కైలాసంలా, లక్ష్మీదేవి వివాహం నాటి వైకుంఠంలా అలంకరించినారు.

దేశంలో ప్రసిద్ధికెక్కిన నర్తకులు, గాయకులు వచ్చినారు. పండితులు కవులు వేంచేసినారు. దేశదేశాల రత్నాలవర్తకులు తమ నిధులలో ఉన్న ఉత్తమ రత్నాల సేకరించి ఓరుగల్లుకు తరలించుకు వచ్చినారు. సామ్రాట్టుకు బహుమతులు ఇవ్వడానికి, తాము భూషణాలు చేయించుకోవడానికి సామంతులు, ధనేశులు రత్నాలు కొంటున్నారు.

శుభముహూర్తం కొలదిదినాలలో ఉన్నది. అటు నతనాటి సీమనుంచి మాధవ నృపతియు, వారి రాణి మహాదేవిన్నీ, వారి సోదరులు, వారి తల్లులున్నూ శ్రీ రుద్రచక్రవర్తి తల్లులూ అయిన మైళమ్మయున్ను, కుందాంబయున్నూ వేంచేసినారు.