పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

గోన గన్నా రెడ్డి

నిలిపి, సిద్ధంగా ఉండెను. విశాలాక్షప్రభువు గన్నారెడ్డి వెనుకనే బాణ మెక్కుపెట్టి సిద్ధముగా ఉండెను.

గోన: విశాలాక్షప్రభూ! ఇంతవరకు మీరు జాగ్రత్తగా ఇతరుల ప్రాణాలను అత్యవసరమైనగాని బలిగొనలేదు. చేతులకు కాళ్ళకు బాణాలు నాటి వీరుల్ని యుద్దంనుంచి పరాఙ్ముఖులుగా చేస్తున్నారు. నా మీదకు ఏ వీరుడన్నా తలపడితే సింహమైపోయి, వాణ్ణి నేలకూల్చడానికి వెరవరేమి?

విశా: మహారాజా! నేను తమకు అంగరక్షకుణ్ణి. అదే నా పరమధర్మం. తక్కిన యుద్ధంతో నాకు పనిలేదు.

గోన: తక్కిన యుద్ధంలోకూడా మీరు పాలు పుచ్చుకుంటే జయము నిశ్చయము అని మీకు తెలుసుననుకోండి. అప్పుడు?

విశా: ప్రభూ! మీరు యుద్ధములో ఉంటే ఆ పక్షానికి జయంతప్పదు. జయం తెచ్చేది మీరు, మీకు అంగరక్షకుణ్ణి నేను.

గోన: నావల్ల జయంరాక, జయంతెచ్చే విధానం మీకు తోస్తుందనుకోండి, అప్పుడు?

విశా: అనవసరంగా అనుకోడాలు ఎందుకండీ? అలా ఎన్నటికీ జరుగదు. నా ప్రభువు విషయంలో నాకు అనుమానం కలగనే కలగదు. ఇక ఈ ప్రశ్నలన్నీ ఎందుకు?

గోన: నిన్ను ఓడించటం కష్టమేనయ్యా! ఏమంటావు మల్లికార్జునరెడ్డీ?

మల్లి: ముందు ముందు మీరు మా ప్రభువును ఓడించనే లేరని తెలుసుకొని తీరుతారు. చూస్తూ ఉండండి.

రెండు గడియల కొక దళము చొప్పున ఎక్కడఉన్నవారక్కడ నిలుచున్న ప్రదేశాలలో నిద్రపోయారు. పగలు గడచినది, రాత్రి గడచినది. ఎక్కడివారక్కడే అటుకులు భుజించువారు, నీరుత్రాగువారూనూ.

ప్రొద్దు ఉదయించిన ఆరుగడియలకు మహాదేవరాజు సేనలలో ముందు వాహినులు, వాలిపోయిన శరీరాలతో, ఎల్లాగో నగరదుర్గం చేరుకుందామని నిర్భయంగా, నిస్సంశయంగా వచ్చారు.

ఇంతలో ఒక్కసారిగా వేయిశంఖాలు ఆకాశం అంటేటట్లు గుండెలు వ్రక్కలయ్యే మహాధ్వానం చేసెను.

చెమటలు గ్రమ్మ, కాళ్ళు వణకిపోవ నిశ్చేష్టములైపోయినవి మహాదేవుని సేనలు.

“మీరు మీ ఆయుధాలన్నీ క్రిందపడవేసి, ఒకరి వెనుక ఒకరు రండి. ఈ దారిని మీ యిచ్చవచ్చిన చోటికి మీరు వెళ్ళవచ్చును” అని పొలికేకలు పెట్టినాడు ఆంధ్రవీరుడు గోన గన్నారెడ్డి.