పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290

గోన గన్నా రెడ్డి

పెళ్ళలు మాత్రం విరిగిపడ్డాయి. దిడ్డిదారులు, గవనులు దరికిచేరడానికి అనేక పర్యాయములు వంతెనలు వేసినా అవి అగ్నిబాణాలచేత దహింపబడినాయి. పడమటి ద్వారాన్ని పట్టుకోవాలని మహాదేవరాజు విశ్వప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. బలగాల రక్షించే రక్షకచ్ఛత్రఫలకాలు సంతతధారగా కురియు శిలావర్షముచేత ముక్కలయినవి.

పదుమూడవ దినాన, మహాదేవరాజు సర్వదుర్గచ్ఛేదకయంత్రాలను ఉపయోగించి తూర్పుద్వారముపై గవిసినాడు. గడకర్ర తెప్పలు వందలకొలది గవనుల కీవలావల వేయించినాడు. వానిని సంరక్షిస్తూ కోటబురుజుల మీదికి వీరులు రాకుండా రెండునూర్ల చక్రగొట్టాలు వెనుక నిలిపినాడు. ఆ కొట్టాలపై నుండి మహాపరాక్రమంతో వీరులు శిలాప్రయోగయంత్రాలు, శతఘ్నులు, మహాబాణాలు ప్రయోగించుచుండిరి. ఆ చక్రకొట్టాలకు బలంగా వేలకొలది ఏనుగులు కవచ రక్షితములై దుర్గాలవంటి అంబారీలతో నిలచినవి. అందుండి వీరులు సంతతముగా అగ్నిబాణాలు ప్రయోగిస్తున్నారు. చిన్ననావలు వందలకొలది విశాలమైన కందకంలో వేసిరి. ఆ నావలపై వంతెనగా వెదురుదళ్ళు వేసినారు. దడులపై మట్టి వేసినారు. వంతెన సిద్ధమైనది. ఈవలావలనున్న దిడ్డుడకడను గూడా ఈలాంటి వంతెనలను వేయించినాడు.

ఆ పదుమూడవ దినమంతా అన్ని గోపురాలకడ, దిడ్లకడ ఇరువాగులవారికి భయంకరయుద్ధము జరుగుచున్నది. రాత్రంతా యుద్ధము జరుగుచునే యున్నది. కరిగిన సీసము, సలసలకాగేనూనె వర్షము కురుస్తున్నది.

వంతెనమీదనుండి ఏనుగులు, వీరులు వస్తున్నారు. ద్వారచ్ఛేదానికై కుంభస్థలాలకు కట్టిన బ్రహ్మశూలాలతో ఏనుగులు తలుపులను బద్దలుకొట్టుతున్నాయి. ఏనుగులకు సహాయంగా వీరులు చక్రయంత్రాలపై నున్న పెద్దయినుప గుదియలతో తలుపులు బద్దలుకొట్టుచున్నారు. పై నుండి కురిసే అగ్ని శిలాబాణవర్షాలకు వేలకొలది వీరులు మడియుచున్నారు. పైన గోడలమీద, బురుజులమీద వీరుడు తల ఎత్తేసరికి చక్రకొట్టాలనుండి బాణవర్షం కురియుచున్నది.

నాటి రాత్రికూడా తూర్పుద్వారందగ్గర ఎడతెగనియుద్ధం జరుగుచూనేఉన్నది. తక్కిన అన్ని ద్వారాలకడను మహాదేవరాజు అఖండమైన ఒత్తిడి కలుగజేయుచునే ఉన్నాడు.

పదునాల్గవ దినము ఉదయించినది. పడమట, ఉత్తర దక్షిణముల గవనులు, దిడ్లు ఒక్కసారిగా తెరచి, వేలకొలది బలములతో రుద్రదేవి వచ్చిపడెను. వంతెనలు కూలినవి.

ప్రసాదాదిత్యప్రభువు, చాళుక్య వీరభద్రుడు, నాగమనీడు, బాప్పదేవుడు, సోమనాథమంత్రి ప్రమథగణాలులా పైకురికారు. ఆ సమయములో గోన గన్నారెడ్డి అకుంఠిత వేగముతో తన అన్ని సేనలను ప్రోగుచేసుకొని