పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

గోన గన్నా రెడ్డి

చక్రముగా వచ్చిన బళ్లు వారి కడ్డమయ్యాయి. గన్నారెడ్డి వీరులు హుమ్మని అగ్నిబాణాలు వర్షంలా శత్రువులపై కురిపించిరి. యాదవులలో కొందరు బళ్ళ అడుగున దూరి విరోధులను నాశనంచేయ ప్రయత్నం చేసిరి. కాని అదివరకే బళ్ళక్రింద గన్నారెడ్డిభటులు కాపలా ఉండుటచేత ఆ ప్రయత్నం చేసిన వారు నాశనం అయ్యారు.

బళ్ళు ముందుకు సాగుతున్నాయి. గన్నారెడ్డి వీరుల పరపిన అగ్నిబాణాలు యాదవసేనల శిబిరాలను అంటించాయి. ఆ మంటల వెలుగున ఇరు వాగులవారూ ఒకరికొకరు స్పష్టంగా కనబడినారు. మహాదేవుని బలాలు మంటల వెనుక దాగికొని మంట లార్పుచుండెను. యుద్దము ఘోరముగా సాగుచున్నది.

తెల్లవారుగట్ల ఉదయం ఒకజాము ఉందనగా గన్నారెడ్డి బలగాలు మాయమై పోయాయి. వారు వెళ్ళేటప్పుడు బళ్ళను లాగుకుంటూనే వెళ్ళిపోయినారు.

ఆ రాత్రి గన్నారెడ్డి శత్రువులను ఏ పదివేలమందినో హతమార్చినాడు. తన సైన్యంలో అయిదువేలమంది చనిపోయినారు.

ఆ రాత్రి యుద్ధముసంగతి గొంకప్రభువు, శ్రీ రుద్రమదేవి చక్రవర్తికి వార్త తెచ్చినాడు. చక్రవర్తి ఎంతో ఆనందించెను. అన్నాంబిక తను ప్రేమించిన వానికడకు పోయెను. ఆమె ఏమి చేయుచుండెనో అని రుద్రదేవి అనుకున్నది. గన్నారెడ్డి ఇప్పటికి నాలుగేళ్ళనుండి ఆంధ్రకాకతీయ మహాసామ్రాజ్యానికి చేసిన సేవ అపారము. గజదొంగ అయిననేమి అనికదా లోకైకసుందరి అన్నాంబిక అతని ప్రేమించినది. అలాంటి బాలికను గన్నారెడ్డి ప్రేమించగలడా?

ప్రేమకు కారణం వ్యక్తంగా కనబడదు. ఎందుకు ఎవరియందు ఎవరికి ప్రేమ కలుగుతుందో ఎవరు చెప్పగలరు?

యుద్ధకాలమందే మానవహృదయంలో ప్రేమ పరవళ్ళెత్తుతుంది. యుద్ధాల నుంచి వచ్చిన వీరుడు ప్రియురాలి వక్షఃస్థలముపై తలవాల్చి ఆమె హృదయగతులు దివ్యగీతము ఆలాపించగా, ఆ జోలకు నిదురపో గోరుతాడు.

ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి నాశనంచేసే సమయంలో అతడు రాక్షసుడే అవుతాడు. ఆలా రాక్షసుడైన మానవుని తిరిగి మానవునిగా చేయగలిగినది ప్రేమ. ప్రేమ ఎంత దివ్యమైనది! స్త్రీయే రాక్షసి అయినప్పుడు పురుషునికన్న వేయిరెట్లు ఎక్కువగా ప్రేమను వాంఛిస్తుంది. ఆమెను దివ్యురాలిగా చేసే తల్లి ప్రేమకు పురుషప్రేమయే ప్రాంగణము. ఆ ప్రాంగణములో తానువలచిన అతిలోకసుందరాకారుడు కర్కశురాలై, రాక్షసియై, మానవప్రాణాదనియైన తన్ను, మనుష్యులను గుర్తించలేని చూపులతోవచ్చే తన్ను ప్రపంచానికంతకు తానే సామ్రాజ్ఞిని అని వచ్చే తన్ను తననుండి రక్షించడానికి గాఢంగా హృదయానికి అదుముకొని తనలో