పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

గోన గన్నా రెడ్డి

హారాలతో నృత్యనృత్తాలతో, అభినయాదులతో, దివ్యగాంధర్వంతో, సర్వ విశ్వ భావంతో తాండవం చేస్తాడట. అన్నీ ఆ తాండవంలో భావమాత్రములే.

శివదేవయ్యమంత్రి చిరునవ్వు నవ్వుకొన్నాడు. శిష్యులంతా లోగొంతుకలతో ఏవేవో చర్చించుకొంటున్నారు.

అంతలో రుద్రదేవచక్రవర్తి హఠాత్తుగా లోనికి దయచేసి గురువునకు సాష్టాంగనమస్కారము చేసింది.

అచ్చటనున్న భక్తులంతా లేచారు. గురుదేవులు తమ ఆలోచనా పథంనుండి మరలి, చటుక్కున లేచి “మహారాజా! రండి అధివసించండి” అని కోరినారు. రుద్రమదేవిన్నీ, శివదేవయ్య దేశికులున్నూ తమ తమ ఆసనా లధివసించగానే భక్తులంతా తమ ఆసనా లధివసించి యుద్ధ విషయాలు వారిద్దరూ మాట్లాడుకొంటూ వుంటే విందామని కుతూహలం పడుతున్నారు.

రుద్ర: నాయనగారూ! ఇంతవరకూ మనదే జయం. మహాదేవరాజు చిందరవందర అయిపోయినాడు. విన్నారా?

శివ: విన్నాను మహారాజా! మీ మనస్సులో ద్వాదశార్కులు ప్రతిఫలింతురుగాక! మీ హస్తాలలో పాశుపతాది దివ్యాస్త్రాలు భాసించుగాక! మీ చూపులలో ఫాలనేత్రాగ్ని వెలిగిపోవుగాక! మీ శత్రువు పరాభూతుడగుగాక! మీకు శుభమగుగాక!

ఆ సభలో ఉన్నవా రందరు ఉప్పొంగిపోయారు.