పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివదేవయ్య

285

రెండు శక్తులూ రుద్రమాంబలో యమునా గంగా సంగమమయ్యాయి!

ఈతల్లి స్త్రీరాజ్య మెంత ఉత్కృష్టమో లోకానికి చాటగలదుగాక. పురుషుడు విభూతులను సంపాదింపగలడు. వాటిని ఉత్తమంగా కాపాడవలసింది స్త్రీగదా? పురుషుడు సృష్టికర్త స్త్రీ సంరక్షణకర్త్రి. ఇది మహాభావవిషయంలో, భౌతికంగా స్త్రీ బిడ్డలను కనాలి, పురుషుడు ఆ శిశువులను రక్షించాలి. ఈ భౌతిక సత్యంలో నుండే తాంత్రికవాద ముద్భవిల్లింది.

ప్రేమకు విముఖుడయిన శివుడు కాముని దహిస్తే దేవి ఏమవుతుంది? విశ్వసౌందర్యాన్ని ప్రేమించి భోగించగల ఆమె దివ్యరాగము పురుషునిలో లేకపోతే విశ్వానికే నాశనం! పరమేశుని ఇచ్ఛ సృష్టిస్థితిలయాలు. నాశనశక్తి భండాసురుడయినది. ఆ నాశనశక్తిని పురుషుడు నాశనం చేయలేకపోవుట విచిత్రము. దేవిని ధ్యానించివాడు పరమేశుడు. తాను ఏమీ చేయలేడు. దేవి ఎక్కడ? సర్వమూ ఆహుతి అయిపోయినది. తానే ఆహుతి అయినాడు. తన ఇచ్ఛ ఆహుతి అయినది.

ఆ దివ్యాగ్నిలోనుంచి దివ్యకామ అయిన దేవి కామేశ్వరిగా ఆవిర్భవించింది. ఉపాధిలేనిశక్తి ఎట్లు? పురుషుడే కామేశ్వరుడు. కామకామేశ్వరి, రాజరాజేశ్వరి అనే భావం విశ్వవిశ్వాలకు, అనంతకాలానికీ మూలమంత్రం, ఆ మంత్రానికి అధిదేవత కాముడే అయినాడు.

అలాంటి ఈ విశ్వంలో, విశ్వానికి మధ్యమయిన ఈ భూమిలో, రాజులు రాజ్యాలకోసం, మతకర్తలు ధర్మాలకోసం, పండితులు తమ వాదాలకోసం విజిగీషులై జైత్రయాత్రలు చేయడం ఎందుకు?

ధనం, భోగం, కీర్తి ఈ మూడూ బ్రతికివున్నన్నాళ్ళే ఉంటాయి. కీర్తి కొన్ని నూర్ల సంవత్సరాలు వుండవచ్చును. ఎంతమంది రాజులు దానశాసనాలు వ్రాయించలేదు. అవి జరుగుతున్నాయా? ఎంతమంది తాత్విక ధర్మస్థాపనలు జరుపలేదు? అవి ఏమయ్యాయి? పరమశివుడే లే డనలేదా బౌద్ధులూ, జైనులూ? ఈ దేశంలో స్త్రీ పురుషులు ఒకనాడు బౌద్ధులు; మరొకనాడు జైనులు; ఈనాడు శైవు లౌతున్నారు.

శైవంమాత్రం ఎన్నివిధాల రూపం పొందటంలేదు. అన్ని తత్వాలు తాత్కాలికమే. కాని వర్తమాన నాటకంమాత్రం తప్పదు.

మహాదేవరాజు ఓరుగంటికి వచ్చాడు. ఏమి కట్టుకుపోతాడు? ప్రాణాలా?

అతడు వచ్చాడని మనం రక్షించుకోవడం ఏమిటి? ఇదిఅంతా ప్రళయ నటేశ్వర మహాభావము. పులితోలో, ఏనుగుతోలో నడుమున కట్టుకొని, కంకాళాలు ధరించి, ముమ్మొనవాలు, డమరుకము, అగ్ని మూడు హస్తాల దాలిచి అభయహస్తంతో సృష్టి స్థితిలయాత్మకము లయిన కోటివేల కరణాలతో అంగ