పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

గోన గన్నా రెడ్డి

గోన: మరి మిమ్మల్ని రక్షించేవారు?

విశా: నాకు మల్లికార్జునరెడ్డి ఉన్నాడుకదా ప్రభూ!

గోన: మల్లికార్జునరెడ్డి?

విశా: ఇల్లా యుద్ధం చేసేవారందరికీ అంగరక్షకులు ఉండాలా మహారాజా?

గోన: ఉండాలని నా ఉద్దేశంకాదు. ప్రతివీరుడూ తన్నురక్షించుకొంటూనూ ఉండాలి. విరోధులను నాశనమూ చేయాలి.

విశా: నాయకునికిమాత్రమే అంగరక్షకులు ఉండాలి. ఆయన సర్వసైన్యానికీ ప్రాణంకాదా ప్రభూ!

విశాలాక్ష ప్రభువు కన్నులు మెరిసినవి. ఆయనమోము వెలిగిపోయినది. గోనగన్నారెడ్డి హృదయం ఎందుకో కొట్టుకొన్నది.

శివదేవయ్యమంత్రి గురుసింహాసనంపై కూర్చుండినారు, సన్నని పొడుగాటి మనిషి, కోలమోము, అతివిశాల ఫాలము, గరుడ నాసిక, ముక్కుకుదగ్గరలో ఉండే లోతుకళ్ళు, పెద్దచెవులు, వెడల్పాటి నోరు, పొడుగుగా పెరిగిన జటలపై రుద్రాక్షకిరీట మున్నది. ముత్యాలు పొదిగిన బంగారు అర్దచంద్రాభరణ మా కిరీటముపై నున్నది. నల్లని కోలబొట్టు మూడవ నేత్రంలా ఫాలాన వెలుగుచున్నది. ఆయన మెళ్ళో రుద్రాక్షమాలలున్నవి. వజ్రాలు పొదిగిన లింగకాయ నాయక మణిలా, ఒక రుద్రాక్షమాలకు వేలాడుచున్నది. ఫాలంపై, చెవులపై, భుజాలపై, విశాలవక్షంపై, మెడపై, ముంజేతులపై, పొట్టపై, వీపుపై విభూతిరేఖలున్నవి.

కైలాసశిఖర హిమసానుపీఠముపై పరమశివునిలా శివదేవయ్యమంత్రి స్ఫటికాసనస్థుడై, భక్తజనపరివృతుడై కూర్చున్నాడు. శైవతత్వవిచార దక్షులు కొందరు, పరమత దూషణవాదులు కొందరు, భక్తులు, గురుపాద ద్వంద్వారాధకులు, రాజకీయవిచారణదక్షులు, ఉద్యోగులు, పండితులు, శాస్త్రజ్ఞులు, మహాకవులు, ఉభయభాషావేత్తలు, తాంత్రికులు, శిల్పులు, జ్యోతిష్కులు, సిద్ధాంతులు, ఆగమవేత్తలు, మొదలైనవా రెందరో ఆ మహామహుని సభలో నిండి ఉండిరి.

శివదేవయ్య అందరితో సహస్రావధానంలా ప్రశ్నోత్తరాలు జరుపుచున్నను ఆ సాయంకాలం జరిగిన మహాయుద్ధాన్నిగురించే ఆలోచిస్తున్నారు.

తాను రుద్రప్రభువుకు ఆలోచనలు చెప్పగూడదు. ఆ ఉత్తమురాలు తన రాజ్యము తానే రక్షించుకోవాలి. తన సార్వభౌమత్వము తానే నిర్మాణము చేసుకోవాలి. ఆమె గణపతిదేవుని కొమరిత. స్త్రీలలోని పరిపాలనాదక్షణ కళాపూర్ణము, శక్తియుతము. పురుషునిశక్తి అత్యంత బలయుతము. పురుషుడు విరోధుల లోబరచుకొన్నా, తన ప్రాభవం కోరుతాడు. స్త్రీ ఇతరులను జయించినా వారిపూజ ఆశిస్తుంది.