పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

గోన గన్నా రెడ్డి

ఇంతలో రుద్రదేవ చక్రవర్తి అఖండసైన్యంతో విచ్చేస్తున్నాడని వేగులు ఇరువాగులవారికినీ అందినవాయను. భీమచోడుడు ఒక రాత్రి రాత్రి ఆంధ్ర సైన్యాలు ఏమరుపాటున ఉండగా సమస్తమందితో చుట్టాలతో పర్వతాలకు పారి పోయినాడు.

బుద్ధారెడ్డి వర్ధమానపురం పట్టుకొన్నాడు. ఇంతలో భేరీ భాంకారాది వాద్యాలు మోగుతూ వుండగా పెద్ద ఉప్పెన వచ్చినట్లు అఖండంగా ఆంధ్ర సైన్యాలను నడిపించుకొని చక్రవర్తి స్వయంగా విచ్చేసి వర్ధమానపురంలో పాపం పొందిన రాజభవనాలు నేలమట్టంచేసి భీమచోడుడుణ్ణి తరుముకుపోయి అతనిచే జోహా రనిపించుకున్నారు. భీమచోడుడు తన కుమార్తె పద్మావతిని శ్రీ రుద్రదేవ చక్రవర్తికి కన్యాదాన సమర్పించి చక్రవర్తికి మామగారై, చేసిన పాపనివృత్తికి గాను సంసారం త్యజించి వీరశైవదీక్ష తీసికొని తపస్సుకై మహాబలేశ్వరం వెళ్ళిపోయ్యాడు. పెద్ద గోకర్ణచోడుని కందూరులో తనకూ బుద్ధారెడ్డికీ సామంతమండలేశ్వరుడుగా చక్రవర్తి నియమించినాడు. మానువనాటి మహామండలానికి రాజప్రతినిధిగా, మండలేశ్వరుడుగా ఇరవై ఐదు ఏళ్ళ శ్రీ బుద్ధారెడ్డి సాహిణి మహారాజును చక్రవర్తి పట్టాభిషేకం చేసినాడు.

శ్రీ రుద్రదేవచక్రవర్తి అవతారం చాలించారు. శ్రీ మహదేవరాజు చక్రవర్తి దేహం చాలించారు. శ్రీ గణపతిదేవ చక్రవర్తి రాజ్యపాలనంవచ్చింది.

ఆ బుద్ధారెడ్డికి బిడ్డలులేరు. ఆయనకు ఏబదితొమ్మిదవఏట రెండవ భార్యయైన ఎరుకసానమ్మ దేవేరియందు కుప మాంబ అనే కుమార్తెయున్ను, గన్నారెడ్డి, విఠ్ఠల ధరణీశుడు అనే కుమారులున్ను రెండేళ్ళ చొప్పున తేడాలుగా పుట్టినారు. బుద్ధారెడ్డి తన తమ్ముడైన లకుమయారెడ్డిని తన యువరాజుగాను, సేనానాయకుణ్ణి గాను చేసికొని ఉన్నాడు. శ్రీ గణపతిదేవ చక్రవర్తి రాజ్యానికి వచ్చిన నలుబది యేండ్లకు బుద్ధారెడ్డి తనకు ఎనుబది ఏడు ఏండ్ల వయసులో దేహం చాలిస్తూ తమ్ముణ్ణి పిలిపించి తన పెద్ద కుమారుడైన గన్నభూపతి తరపున రాజ్యం చేయ వలసిందనిన్నీ, వాడు పెద్దవాడు కాగానే వాడి రాజ్యం వాడికి ఇచ్చి ‘నువ్వు భువనగిరి పరిపాలించవయ్యా లకుమయా!’ అని సెలవిచ్చి లింగైక్య మందినాడు.

లకుమయ మహావిచారంతో రాజ్యభారం పూని అన్నకుమారునికి బదులుగా రాజ్యం చేస్తూ ఉండెను. శ్రీ గణపతిదేవ చక్రవర్తికి బాసటయై పశ్చిమాన విరోధులైన రాజుల్ని హతమారుస్తూ ఆంధ్ర సామ్రాజ్యం విస్తరింపచేశాడు.

రాజ్యపరిపాలన చేసినకొద్దీ రాజ్యకాంక్ష మొలకెత్తింది. కోరలు పోయి, పంజాలకు బలంతగ్గిన సింహమైనట్లు శ్రీ గణపతిరుద్రదేవులు ముసలిపండై ఉండగా ఇదే అదనని లకుమయ రానురాను అనుమకొండలో విద్య లభ్యసిస్తున్న