పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాదవులు

267

రాజ్యం చాలాభాగం కబళింపవచ్చు, తనకు లోకువ అయినవాని నొక్కని ఓరుగల్లు సింహాసనం ఎక్కించి తాను నాటకం ఆడించవచ్చు, ఓరుగల్లులో మూడులక్షల సైన్యం, నాశనంకాగా మిగిలినది తనకు ఆరులక్షలుంటుంది. ఇక ఓరుగల్లుదగ్గర కలుసుకొనే విరోధి సామంతులు రెండు మూడు లక్షలై నా ఉంటారు. ఇప్పటికే తనతో కందూరి కేశనాయని బందుగులు కల్యాణి చోడోదయుని బందుగులు, మేడిపల్లి కాచయ బందుగులు రెండులక్షలవరకు సైన్యాలను తీసుకువచ్చి చేరారు. ఇంతకన్న యుద్ధవిజయసమయం తనకు కుదరదన్నమాట నిశ్చయం. నిశ్చయం.

అగ్నిశకట ప్రళయానంతరము సైన్యము సడలకుండా కూడదీసుకొని నూతనంగా సూచీవ్యూహాలు మూడు రచించి, తన వాహినులనన్నీ ముందుకు నడిపించసాగినాడు. సేనలను తరిమి తరిమి నడుపుచున్నాడు. ఏలాంటి అడ్డం వచ్చినా, దారిలోంచి తుడిచివెయ్యమన్నాడు. అత్యంతవేగంగా జైత్రయాత్ర సాగించే సేనల దారిలో పెద్ద అనీకాలైనా అడ్డగించలేవన్నాడు.

ఆనాటినుంచి మహాదేవరాజు సైన్యవేగం అడ్డగింపడానికి భయపడ్డారు గోన గన్నారెడ్డి, చౌండసేనాపతి మొదలైన వీరులు.

వేగవంతమైన నదికి ఆనకట్ట ఎవరుకట్టగలరు?

గన్నారెడ్డి మహాదేవరాజు సైన్యాలకు ముందుండడం మానివేసి, మళ్ళీ వెనుకనుండే తాకుట కారంభించాడు. అందు కొంతబలం ఏర్పాటుచేసి తానూ, చౌండ సేనాపతి కుమారుడు కాటచమూపతీ కలసి ఆశ్వికదళాలను మాత్రం అపరిమిత వేగంగా ముందుకు పదిహేను గవ్యూతుల దూరం తీసుకుపోయారు. ఈ వచ్చే వేగంతో మహాదేవరాజు రెండుదినాలకు ఆ ప్రాంతాలకు చేరగలడు. ఆ రెండు దినాలలో గోన గన్నారెడ్డి అగ్నికోట ఒకటి కట్టించాడు. గంధకపు ధాతువులతో అగ్ని స్తంభాలు సిద్ధంచేయించి, అవి అక్కడక్కడ మూడు గవ్యూతుల పొడుగునా అర్ధగవ్యూతి మందమున పాతివేయించినాడు. ఆ అగ్నికోటకు ఈవలావల తానూ, కాటయసేనాపతి ఆశ్వికదళాలతో పొంచుండినారు.

మూడవనాడు విరోధుల బలాలు చేరువకు రాగానే, ఆ అగ్ని స్తంభాలు అంటించినారు, గన్నయ్య ఆశ్వికులు. పొగలు, మంటలు ఆకాశంకప్పినాయి. ఈ సందు దొరకని అగ్నికుడ్యాలూ, భరింపరాని వాసనగల పొగలుచూచి, అతివేగంగా చొచ్చుకువచ్చే మహాదేవరాజు వాహినులు ఆగిపోయినవి. మహాదేవ రాజు తన భద్రగజంపై అధివసించి, ఆ దృశ్యంచూచి, విరోధిని మెచ్చుకుంటూ సేనలకు అగ్నిచక్రవ్యూహం రచించి నెమ్మదిగా వెనుకకు జరిపించినాడు.

అప్పుడు గోన గన్నారెడ్డి ఒకవైపునుంచీ, కాటయసేనాపతి ఒక వైపు నుంచీ ఆ వ్యూహ బంధాన్ని ఛేదించసాగినారు. ఇంతలో వెనుకనుంచి విఠలధరణీశుడు, చౌండసేనాని, సూరపరెడ్డి మహాదేవుని తాకినారు.