పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

గోన గన్నా రెడ్డి

మాయమైనాడు. ముందుకు సాగకుండా విఠలధరణీశుడు, సబ్బప్రభువు, సూరన్న రెడ్డి, చిన అక్కినప్రగడ, రేచర్ల చినదామానాయుడు, చిన మల్యాల ప్రభువు రక్కసులలాంటి సైన్యాలతో అడ్డుపడుతున్నారు.

గన్నారెడ్డి మొదటిసారి మహాదేవుణ్ణి తాకినప్పుడు సైన్యం వెనుకనే వచ్చు వర్తకనగరమూ, పశునగరమూ పటాపంచలైపోయినాయి. గన్నారెడ్డి తృప్తితీర మహాదేవరాజు ధాన్యాదులను, పశువులను దోచుకున్నాడు. ఆ వెంటనే మాయమైనాడు. తరుముకువచ్చిన సైన్యాలను హతమార్చినాడు.

ప్రళయకాలరుద్రుడై మహాదేవరాజు గోన గన్నయ్యను చేతులతో నలిపివేయుద మనుకున్నాడు. ఖడ్గముతో కండకండలుచేసి గద్దలకు, కాకులకు ఎగురవేయవలె ననుకున్నాడు. దేవగిరికి నలభై గవ్యూతుల దూరంలో ఉన్న మంజుల గ్రామం దగ్గర విడిదిచేసినాడు. అప్పటికే అతని సేనలో గోనగన్నారెడ్డి ముష్కర క్రియవల్ల డెబ్బదివేలు మడసెను. ఆరు నెలలకు తెచ్చుకొన్న ఆహార పదార్థాలలో రెండు నెలల పదార్థాలు గన్నారెడ్డి దోచుక పోయాడు.

ఆతని సైన్యం మంజుల గ్రామానికి మూడు గవ్యూతులు ఉన్న గోదావరి కడనుండి పది గవ్యూతుల దూరములోఉన్న ధారునగరంవరకూ విస్తరించి ఉన్నది.

ఆహారపదార్థాలు సైన్యం మధ్యఉండేటందుకు ఏర్పాటుచేసి, ఈ మహా సైన్యంచుట్టూ ఆశ్వికసైన్యాలు, విలుకాండ్ర దళాలు సర్వకాలమూ యుద్ధసన్నద్దులై ఉండ ఏర్పాటుచేసినాడు మహాదేవరాజు, అనేక చారదళాలు విరోధిసైన్యాల రాక తెలియ జేయ ఏర్పాటు చేసినాడు.

రక్తాక్షి సంవత్సర జ్యేష్ఠ శుక్ల దశమినాడు దేవగిరిలో బయలుదేరి యీ జ్యేష్ఠబహుళ దశమికి ఇంకా మంజుల గ్రామంలోనే ఉన్నాడు మహాదేవరాజు. ఆరాత్రి మహారాజు ఆలోచనాశిబిరంలో, సర్వసైన్యాధ్యక్షులూ, మంత్రులూ చేరినారు.

మహారాజు సింహాసనంపై అధివసించి ఉన్నాడు.

ముఖ్యసేనాపతి సింగదేవప్రభువు (మహాదేవరాజు దాయాది) “మహారాజా! మన ఎనిమిదిలక్షల సైన్యాలలో రెండు లక్షల సైన్యాన్ని గన్నయ్యను తరమడానికి విడదీశాం, ఆ సైన్యం మంజీరానది తీరాలకు నైరుతిగా అతని సైన్యాలను తరుముతూనే ఉంది. ఇంతట్లో ఎక్కడనుండి వచ్చాడో ‘గోన గన్నయ్య’ అని మన సేనాపతులందరూ చికాకుపడుతున్నారు.

మహా: వీడు బ్రహ్మరాక్షసా, పిశాచా?

భవానీభట్టు (మహామంత్రి): మహాప్రభూ! ఈ గోన గన్నయ్యకు గజదొంగ అని పేరుపడింది అంతామాయ. వీడు రుద్రమదేవికి సహాయంగా ఏర్పడిన దొంగసైన్యాలకు నాయకుడు.