పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తమ చాళుక్యుడు

257

ఇంతలో ముమ్మక్క అన్నాంబలు స్నానాలాచరించి, వస్త్రాలు ధరించి దేవకన్యలులా వచ్చారు. రుద్రమ అదివరకే స్నానమాచరించి చీనీ చీనాంబరాలు ధరించిఉన్నది. వారిద్దరూ వచ్చుటచూచి ‘పాపం! వీ రిరువురూ సంపూర్ణ యౌవన వతులైన కన్యలై, తనవలనకదా పెళ్ళికాక ఉన్నారు’ అనుకున్నది.

తానే పెళ్ళికాని కన్యయై ఉన్నదే! స్త్రీలకు పెళ్ళి అయితీరాలన్న ధర్మశాస్త్ర ప్రమాణ మున్నది. పురుషులు పెళ్ళికాకుండా ఉన్నా పతితులు కాకపోవడమేమి? పురుషుడు పరస్త్రీగతుడైనా, అతడు భార్యతో దాంపత్య ధర్మము నెరవేర్చడానికి అర్హుడు స్త్రీ ఒకసారి పరపురుషరతయైతే భర్తతో దాంపత్యం నెరవేర్చడానికి అర్హురాలుకాదు. ఈ ధర్మనిర్ణయాలు రావడానికి సహస్రకారాణా లుండవచ్చు.

ఇంతలో ముమ్మక్క రుద్రమదేవికడకువచ్చి “అక్కగారూ! చాళుక్య వీరభద్ర మహారాజు అంత చిన్నబాలునిలా అయిపోయినారేమిటి? అని అన్నాంబిక నన్ను మూడుసారు లడిగింది” అని చిరునవ్వుతో తెలిపింది.

“అల్లరిపిల్లా! పెద్దలంటే భక్తిలేకుండా వేళాకోళాలుచేస్తావా?” అంటూ రుద్రాంబ తరుముకువచ్చింది. ముమ్మక్క పారిపోయి అన్నాంబిక వెనుక దాగెను.

అన్నాం: ఉండండి అక్కగారూ! నాకు నిజంగానే అనుమానం కలిగింది ఏమి చేయమంటారు? (పక పక నవ్వును)

రుద్ర: అల్లాగా! నిజమైన అనుమానం కలిగిందే! దానికి నిజమైన ప్రత్యుత్తరం గోన గన్నారెడ్డిని అడిగి తెలుసుకోవాలి.

ముమ్మక్క: (అన్నాంబిక వెనుకనుంచి ముందుకువచ్చి) అమ్మయ్యా, ఓ తాయిలంగారికి మా చక్కని ప్రత్యుత్తరం వచ్చింది. అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

అన్నాం: ఓ చాళుక్య మహాదేవరాజు నడిగితే అనుమానాలు గినుమానాలూ ఏమీ వుండవనే అంటారు.

రుద్ర: మహాదేవరాజేమిటి చెల్లీ?

అన్నాం: ఏమీలేదు అక్కగారూ! మొన్న మనం వడ్డపల్లెకు వెళ్లకమునుపు ఓ తాయిలంగారు తదేకదీక్షతో మీ సభలోవున్న ఒక మహాపురుషుని తెరల వెనకాలనుంచి చూస్తున్నారు. ఇది మొదటిసారికాదు. మీరు సేనానాయకుల సభ చేసిన దినాన, మీ ఆలోచనామందిరంలో అవరోధ జనంవుండే చోటనుంచి గవాక్షం గుండా ఆతాయిలంగారే ఆ మహాపురుషుని చూస్తుంటే నేను దొంగలా కనిపెట్టుతున్నాను.

ముమ్మక్క: అమ్మ దొంగా!