పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

గోన గన్నా రెడ్డి

రుద్ర: ఇంక ఎప్పుడా దివ్యయుగం అవతరించడం?

శివ: మహారాజా! అనేకచోట్ల కృతయుగాలలో ఒక్క మహాపవిత్ర కృతయుగం ఉద్భవిస్తుంది. ఆ కాలంలో శైవ, బౌద్ధ, జైన, వైష్ణవ మతాలుండవు. మ్లేచ్ఛులు, ఆర్యులు, దస్యులు, అనురులు అనే తేడాలుండవు. బీదలూ, ధనవంతులూ ఉండరు. పాలించేవారూ, ప్రజలూ అనే వర్గాలుండవు. అభిమానం, గర్వం, అహంకారము, ఆశ, క్రోధము, కామం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఏమీ ఉండవు. మానవులప్పుడు దేవతలై పరతత్వం చేరుతారు ప్రభూ!

రుద్ర: ఈలోగా ఈలా మనుష్యులు సర్వబాధలు అనుభవిస్తూ ఉండ వలసిందేనా?

శివ: అప్పుడప్పుడు ప్రతిమనుష్యుడూ ఏదో మహత్తర సన్నివేశమందు భగవత్సమాను డవుతూ ఉంటాడు. కొందరు మనుష్యులు బ్రతికివున్నంతకాలమూ దేవతలుగా ఉండి అవతారం చాలిస్తారు. భక్తులు ఉద్భవించి తమ తమ వుత్తమ కర్మలద్వారా లోకానికి దారి చూపిస్తూ ఉంటారు.

ఈ ధర్మరక్షణార్థం స్త్రీ అయ్యూ తాను ఎన్ని భయంకర మృత్యు నాట్యాలు చూడవలసిఉంటుందో అని రుద్రదేవి అనుకొనుచు దేశికులకు వీడుకోలు ఇచ్చి అభ్యంతర గృహాలలోనికి పోయినది.

శ్రీ చాళుక్య వీరభద్ర మహారాజునకు ఏదో ఆవేదన జనించి తనకై అరుదెంచినారా? ఎంత విచిత్ర సంఘటన! సైన్యములేక ఒక్కరు వచ్చినారా? అది ఎంత అవివేకము! వడ్డపల్లినుండీ, మొగలిచర్లనుండీ వీరముష్టులనూ, వీరభద్రులనూ, ఆ మహారాజు వెంటబెట్టుకురావడము విచిత్రమైన విషయమే.

హరిహరదేవులు తన్ను హతమార్చియుందురు. ఆరీతిగా తన ప్రాణము పోయి ఉన్నట్లయితే, కాకతీయ సింహాసనంకోసం ఈ దారుణసంగ్రామాలన్నీ ఉద్భవించకుండా ఉండునుకదా!

చాళుక్య వీరభద్ర మహారాజు యుద్ధం జరుగుతున్నంకాలం దుర్నిరీక్ష్య తేజు డై, యుద్ధం కాగానే చంటిబిడ్డవలె ‘తాము క్షేమంగా ఉన్నారా?’ అని అడిగినారు. ఆ ఉత్తమ చాళుక్యునకు అంత భయంకర క్రోధం ఉద్భవించడానికి కారణం, తన కప్పుడు సంభవించిన ఆపదేకాబోలు? ఆ సమయంలో తాను మాటే మరచిపోయి ఆడుపులిలా, తన పురుషుడు శత్రువుల నాశనం చేస్తూంటే చూచి ఆనందంతో ఉప్పొంగిపోయినదేమి!

ప్రతి స్త్రీ తన పురుషుడు బలంతో విజృంభించి శత్రువుల నాశనం చేస్తూ ఉంటే, చూస్తూ ఉప్పొంగిపోతుంది కాబోలు. అదేకాబోలు గురుదేవులు వచించిన మానవపశుత్వము; రాజుల కందుకే వేట అన్నా, కోడి, గుఱ్ఱం, ఏనుగు, పెద్దపులి పందేలన్నా ఇష్టము.