పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తమ చాళుక్యుడు

255

రుద్రసేనాని హరిహరుని చిత్రవధ చూడలేక మోమటుతిప్పుకొనియుండి వీరభద్రుని మాట వినగానే ఆ ప్రభువువంక చూచి చిరునవ్వు నవ్వినది. చాళుక్య వీరభద్రునికోపము పాలు విరిగినట్లు విరిగిపోయినది.

6

చాళుక్యవీరభద్రుడు రుద్రదేవ చక్రవర్తిని, అన్నాంబికను, ముమ్మడాంబికను రాత్రికి ఓరుగల్లు గొనిపోవుసరికి హరిహరమురారిదేవుల రాజద్రోహ సంఘటన, వీరభద్ర మహారాజు వారిని నాశనముచేయుట నగరమంతట ప్రాకిపోయినది. శివదేవయ్య దేశికులు వెంటనే రాచనగరుకువచ్చి చక్రవర్తిని క్షేమమడిగి ‘ఈ దేశములో పరిపూర్ణశాంతి వచ్చేవరకు చక్రవర్తిని సరియైన అంగరక్షక బలము వెంట రాకుండ ప్రయాణం చేయకూడ దని మనవిచేసిరి.

రుద్ర: బాబయ్యగారూ! ఎంతకాలం జాగ్రత్తతో భయపెట్టి సైన్యాల పెంచి, రాజ్యం పాలించగలం? రాజ్యపాలన ధర్మరక్షణకోసం అధర్మ బలంతో రాజ్యాలు నిలబెట్టగలమా?

శివ: ధర్మరక్షణకు అధర్మమార్గం పనికిరాదు భయంచేత రాజును తన్ను రక్షించుకొమ్మని ధర్మశాస్త్రాలు చెప్పవు. మానవహృదయంలో కాంక్ష కుములుతూ ఉంటుంది. రాజ్యం చేయవలెననే దురాశతో ఎవరైనా నిరాయుధు డైన రాజు పై విరుచుకు పడవచ్చును; సుదుర్లభు డైన ఉత్తమ ప్రభువు తన్ను దా నేమరకూడదు.

రుద్ర: కవులు, గాయకులు, పండితులు, మహాఋషులు నిరాయుధులై, నిర్భయులై ఎలా జీవిస్తున్నారో రాజులుకూడా ఒక్కధర్మమే బలంగా రాజ్యం చేయవద్దా గురుదేవా? దైవబలంకాక రాజ్యాలు పశుబలం మీద ఆధారపడి ఉన్నంత కాలం భగవంతుడే జగత్తునుండి మాయమై పోయినట్లుకాదా?

శివ: రుద్రప్రభూ! మానవుడు ధర్మపథం తప్పినప్పుడే రాజ్యాల అవసరం కలుగుతుంది. ప్రపంచం ధర్మక్షేత్రమైనప్పుడు, రాజ్యాలూ, రాజులూ, చతురంగబలాలూ, కోటలూ, కందకాలూ, రక్షకభటులూ, చారులూ, ఆయుధాలూ అస్త్రాలూ అవసరమేమిటి?

రుద్ర: ఆస్థితి ప్రపంచానికి ఎప్పుడయినా లభిస్తుందా బాబయ్యగారూ?

శివ: అలాంటిస్థితి లోకానికి ఒక్కసారే సాధ్యము!

రుద్ర: కృతయుగంలోనా?

శివ: కృతయుగంలోనూ కాదు! కృతయుగంలో మానవజీవితము శైశవావస్థలో ఉన్నది. శిశువులు దేవతాస్వరూపులు. వారికి ప్రభువులు దేవతలే! కాబట్టే శిబి, దధీచి మొదలయినవారు; వేణుడు, నహుషుడు, దక్షుడు మొదలయినవారు అప్పుడు ఉండేవారు.