పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

గోన గన్నా రెడ్డి

ఇది ఏమి అని ఆశ్చర్యపడి అటు చూచేసరికి ఆ ప్రక్క ఎత్తయిన రాళ్ళ గుట్టమీద శ్రీ చాళుక్య వీరభద్రుడు ఇరువదిమంది విలుకాండ్రతో నిలచి యున్నాడు. ఆవిలుకాండ్రమధ్య వీరభద్రుడు ప్రమధులమధ్య కుమారస్వామిలా ఉన్నాడు. వీరభద్రుని ధనుస్సు త్రిపురాసులపై నెత్తిన పాశుపతంలా ఉన్నది.

మురారిదేవుడు మరల ధనుస్సునెత్తి రుద్రమవైపు గురిచూచినాడు. అమరుక్షణంలో అతడు మృత్యుదంష్ట్రవంటి బాణము గుండెను దూసుకొని పోగా ఏనుగుపై విగతజీవుడై పడిపోయినాడు.

హరిహరదేవుడు రౌద్రాన జేవురించి అంగరక్షకుడు ఫలకము నడ్డుపెట్టగా తన మహా ధనుస్సును ఎక్కుబెట్టి చాళుక్య వీరభద్రునిపై పది బాణాలు వదలెను. ఆ పదిబాణాలు పదిరెట్లు పెరిగి తిరిగి అతనినే తాకినవా అన్నట్లు ఆ ఏనుగు అంబారీని నూరుబాణాలు కప్పినాయి. హరిహరదేవుని ఫలక ధారి ప్రాణము వదలి ఏనుగుపై పడిపోయినాడు.

వీరభద్రుడు ప్రళయకాలరుద్రుడై కదలికలేక ఎడతెరపిలేని క్రూరభల్లాల ప్రవాహము కట్టించి హరిహరదేవుని కవచము, శిరస్త్రాణము చీల్చివేసినాడు. ధనుస్సు ఎత్తుకొనే వీలులేక ఏనుగుపై హరిహరదేవుడు మార్ఛితుడైనాడు.

రేచర్ల రుద్రప్రభువు ఎలుగెత్తి ‘చక్రవర్తిపై కత్తిఎత్త సాహసించగల పిరికిపంద లెవ’రని భూనభోంతరాలు పగుల కేకవేసి తన చిన్నసైన్యాన్ని హరిహరదేవుని సైన్యాన్ని తాకుమని కొమ్ము ఊదినాడు.

ఆజ్ఞ యిచ్చుట తరువాయిగా ఉద్దండులైన ఆ అంగరక్షకులు హరిహర దేవుని సైన్యం పై విరుచుకొనిపడిరి. శ్రీ చాళుక్యవీరభద్రుడు ఆ రాళ్ళగుట్టమీద నుండి పిడుగు ప్రవాహం దొర్లుకు వచ్చినట్లు హరిహరదేవుని సైన్యం జొరబడగానే ఆయన ధాటికి నిలువలేక సైన్యాలు వీగిపోయినవి. వీరభద్రునితో గ్రామ వీరభద్రుడు, వీర ముష్టులు ‘ఆశ్వరభ శరభా’ అనుచు ఒళ్లు తెలియని ఆవేశముతో హరిహరదేవుని సైన్యముపై బడినారు.

ఈ రెండు అగ్నులమధ్యపడి హరిహరదేవుని సైన్యము నుగ్గునుగ్గయి పోయినది. హతశేషులు తెగిన హారములోని పూసలుగా దెసల చెదరిపోయారు. వీరభద్రులు మహావేగముతో త్రిశూలాలతో హరిహరుని గజాన్ని పొదివి ఎంత మంది పిండియైనను లెక్కసేయక పరశులతో, భల్లాలతో ఆ ఉత్తమగజాన్ని ముక్కలుగా చీల్చి, అంబారీలో క్రిందపడిన హరిహరదేవుని చిన్న చిన్నకండలుగా నఱకివేసిరి.

చాళుక్యవీరభద్రుడు అత్యంత వీరావేశంతో రుద్రదేవుని రథం సమీపించి ‘చక్రవర్తిని క్షేమమా’ అని అడిగినాడు.